Police Raids Madhu yashki House : కాంగ్రెస్ సీనియర్ నేత, ఎల్బీనగర్ అభ్యర్థి మధుయాష్కీ ఇంటి కి మంగళవారం అర్ధరాత్రి పోలీసులు చేరుకున్నారు. తాము సోదాలు చేయడానికి వచ్చామని వారు చెప్పడంతో మధుయాష్కీ కంగుతిన్నారు. అర్ధరాత్రి పూట సోదాలేంటి అని పోలీసులను ప్రశ్నించారు. కొన్ని రోజులుగా కాంగ్రెస్ నేతలే లక్ష్యంగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు మధు యాష్కీ ఇంట్లో సోదాలంటూ పోలీసులు రావడం చర్చనీయాంశమైంది.
ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు తుమ్మల, పొంగులేటి లక్ష్యంగా ఐటీ సోదాలు కొనసాగాయి. ఇక సోమవారం కూడా పలువురి ఇండ్లపై కూడా ఈ తనిఖీలు కొనసాగాయి. మంత్రి సబితా రెడ్డి అనుచరుడి ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహించగా, పెద్ద ఎత్తున నగదు లభ్యమైనట్లు టాక్ వినిపిస్తున్నది. ఇక మధుయాష్కీ ఇంటికి మంగళవారం అర్ధరాత్రి పోలీసులు చేరుకున్నారు. వారిని చూసి మధుయాష్కీ సీరియస్ అయ్యారు. సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా సోదాలు చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలను అధికార పార్టీ ఆదేశాల మేరకు టార్గెట్ చేసి, సోదాలు చేస్తున్నారని మండిపడ్డారు. అర్ధరాత్రి పూట ఈ తనిఖీలు ఏంటని మండిపడ్డారు.
మధుయాష్కీ ఇంటికి పోలీసులు చేరుకున్నారనే సమచారం బయటకు రావడంతో, ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణులంతా అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ పెద్ద హైడ్రామా నెలకొంది. మధుయాష్కీ ఇంట్లో పెద్ద ఎత్తున నగదు నిల్వలు ఉన్నట్లు తమకు సమాచారం అందిందని అందుకే తనిఖీలకు వచ్చినట్లు పోలీసులు చెప్పినట్లు సమాచారం. అయితే ఈ సమాచారం ఇచ్చింది ఎవరనేది మాత్రం వారు వెల్లడించలేదు. అయితే మధుయాష్కీ ఇంట్లో ఏ మేరకు పట్టుకున్నారనే విషయమై ఎలాంటి సమాచారం తెలియరాలేదు.