Weather Alert : బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింతగా బలపడుతోందని, అది తీవ్ర తుపానుగా మారి ఆదివారం వరకు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా పయనిస్తే ఏపీ తీరానికి దూరంగా కదులుతోంది. ఇది గురువారం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. శుక్రవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశముంది.
అనంతరం ఈశాన్య దిశగా కదులుతూ శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడనుంది. తర్వాత ఉత్తర దిశగా పయనించి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు చేరువై ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారుతుంది. ఆది, సోమవారాల్లో పశ్చిమబెంగాల్, ఉత్తర ఒరిస్సా, మిజోరం, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. ఏపీ సహా పశ్చిమబెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవుల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేసింది.
మరోవైపు అరేబియా సముద్రంలో కేరళ తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలె కురుస్తున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది.