Lorry-Bus Accident : ఆంధ్రప్రదేశ్ లో లారీ-బస్సు ఢీ : ఆరుగురు మృతి
Lorry-Bus Accident : రెండు ట్రక్కులు, ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘటనలో ఆరు గురు అక్కడికక్కడే మృత్యు వాత పడ్డారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో శనివారం తెల్లవారు జామున జరిగింది. కావలి-ముసునూరు టోల్ ప్లాజా సమీపంలో బస్సును లారీ ఢీ కొనడంతో ఈ పెను ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న మరో ట్రక్కును వెనుక నుంచి ఓ ట్రక్కు బలంగా ఢీ కొట్టింది. రెండో ట్రక్కు రోడ్డుకు అవతలి వైపు నుంచి ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టిందని పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్ లకు తరలించగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తోంది. అందులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఈ ప్రమాదంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నెల్లూరు నుంచి విజయవాడ వెళ్తున్న వాహనాలు 2 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి. ఈ ప్రమాదంపై గవర్నర్ అబ్దుల్ నజీర్ తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రోడ్డుపై ప్రయాణించే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ట్రాఫిక్, పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. అతివేగం, నిబంధనల ఉల్లంఘననే ఇలాంటి ప్రమాదాలకు కారణం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. తెల్లవారు జామున కావడంతో రహదారి కనిపించలేదా? లేదంటే మరేమైనా కారణం చేత ఈ ప్రమాదం జరిగిందా? అని ఆరా తీస్తున్నామని ఆయన తెలిపారు. త్వరలోనే వివరాలు తెలుపుతామని పోలీసులు తెలిపారు.