Kejriwal : భారత దేశ సార్వత్రిక ఎన్నికలపై పోస్టు చేసిన పాక్ ఎంపీకి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘మా వ్యవహారాల్లో తలదూర్చకుండా, మీ దేశం సంగతి మీరు చూసుకోండి, మీ మద్దతు ఏం అక్కర్లేదు’ అంటూ బదులిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో భాగంగా అరవింద్ కేజ్రీవాల్, తన కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం సంబంధిత చిత్రాన్ని తన అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.
ఈ పోస్టును పాకిస్థాన్ మాజీమంత్రి, ఎంపి చౌదరి ఫహద్ హుస్సేన్ రీపోస్టు చేస్తూ.. ద్వేషం, అతివాద భావజాలంపై శాతి, సామరస్యం విజయం సాధించాలని కామెంట్ పెట్టారు. దానికి ఇండియా ఎలక్షన్స్ అనే హ్యాష్ టాగ్ జతచేశారు. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ వెంటనే స్పందించారు. ‘‘చౌధరి సాహిబ్.. మా దేశ సమస్యలను నేను, నా దేశ ప్రజలు పరిష్కరించుకోగలం. ఈ విషయంలో మీ సలహాలేం మాకు అక్కర్లేదు. అసలే మీ దేశం ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. ముందు దాని సంగతి చూడండి. భారత్ లో ఎన్నికలు అనేవి మా అంతర్గత వ్యవహారం. ప్రపంచం పైకి ఉగ్రవాదాన్ని ఎగదోసే మీలాంటి వారి జోక్యాన్ని మా దేశం ఏమాత్రం సహించదు’’ అంటూ కేజ్రీవాల్ పోస్ట్ చేశారు.