Lokesh Padayatra Restart : లోకేష్ పాదయాత్ర పున: ప్రారంభం.. బాబు సానుభూతి క్యాష్ చేసుకునేనా..?
Lokesh Padayatra Restart : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర రెండో విడుత కొనసాగించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన ఈనెల 24 నుంచి రెండో విడుత యువగళం యాత్రను రాజోలు నుంచి ప్రారంభించబోతున్నారు. పార్టీ అధినేత , తన తండ్రి చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన తర్వాత ఆయన పాదయాత్రను తొలి విడుతలో ముగించారు.
ఆ తర్వాత తన తండ్రిని విడిపించేందుకు ఆయన ఢిల్లీలో మకాం వేశారు. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతూ తండ్రికి బెయిల్ విషయంపై ప్రయత్నించారు. జాతీయ స్థాయి నేతలను కలిసి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. ఇక ఆ తర్వాత ముందస్తు బెయిల్ పై చంద్రబాబు విడుదల కావడంతో, ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇక మరోసారి తన పాదయాత్రను కొనసాగించేందుకు ఆయన నిర్ణయించారు.
అయితే ముందుగా అనుకున్న ప్రకారం పాదయాత్రను ఇచ్చాపురంలో ముగించకుండా విశాఖలోనే ముగించాలని అనుకుంటున్నట్లు సమాచారం. గతంలో తన తండ్రి చంద్రబాబు పాదయాత్రను కూడా విశాఖలోనే ముగించారు. ఇదే సెంటిమెంట్ తో లోకేశ్ కూడా అక్కేడే ముగించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది. అయితే రానున్న ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా లోకేశ్ పావులు కదుపుతున్నారు. ఇక యువనేత పాదయాత్రకు పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 24 నుంచి రెండో విడుత పాదయాత్ర ప్రారంభం కానుంది.
అధికార పార్టీ కేసులతో వేధిస్తున్నా ప్రజల్లోనే ఉండాలని పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. రానున్న మూడు నెలలు అత్యంత కీలక సమయమని, ప్రజల్లోనే ఉండి చంద్రబాబు అరెస్ట్ తరువాత వచ్చిన సానుభూతిని క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారట. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్రజల్లో ఒక్కసారిగా టీడీపీ పై ఆదరణ పెరిగింది.
రాష్ర్టంలోనే సీనియర్ నేత అయిన చంద్రబాబును అధికార పార్టీ వివిధ కేసులతో అభియోగాలు మోపి, ఇబ్బందులు పెట్టడాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించారు. ఇక కేసులు, ఏఫీ ప్రభుత్వం తీరు, వైసీపీ ఆగడాలను ప్రజల్లో ఎండగట్టడం ద్వారా వచ్చే ఎన్నికల్లో గెలుపు ను కైవసం చేసుకోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు.