ABP C-voter Survey : లోక్ సభ ఎన్నికలు: ప్రస్తుత ప్రభుత్వంపై ఎంత సంతృప్తిగా ఉన్నారంటే..? ఏబీపీ సీ-ఓటర్ సర్వేలో సంచలన విషయాలు
ABP C-voter Survey : లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే రిలీజైంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కోడ్ అమల్లో ఉంది. పోలింగ్ కు మరికొద్ది రోజులే సమయం ఉండడంతో అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఒకవైపు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే 400 సీట్లే లక్ష్యం పెట్టుకోగా.. బీజేపీ ఒంటరిగా 370 సీట్లు దక్కించుకుంటుందని పార్లమెంట్ సాక్షిగా మోడీ ప్రకటించారు. ఈ విధంగా ఎన్డీఏ కూటమి దూసుకుపోతుంటే, మరోవైపు ప్రతిపక్ష కూటమి అయిన ఐ.ఎన్.డీ.ఐ.ఏ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించే ప్రయత్నంలో బలప్రదర్శనకు ర్యాలీలు నిర్వహిస్తోంది.
రెండు సార్లు ప్రభుత్వానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఓటమి పాలైతే దేశంలో కనుమరుగయ్యే పరిస్థితి రావచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా తీవ్ర అసహనానికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు సభల్లో కూడా ఆయన వ్యాఖ్యలు అలాగే అనిపించాయి. ఈ సారి కనుక కాంగ్రెస్ గెలవకుంటే ఇక దేశంలో కాంగ్రెస్ అనేదే ఉండబోదని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి. నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పనితీరుపై ‘సీ ఓటర్’ ఇటీవల సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో వివరాలను ప్రకటించింది.
సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో 42 శాతం మంది మోడీ ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేయగా, 29 శాతం మంది తక్కువ సంతృప్తితో ఉన్నట్లు వెల్లడైంది. దాదాపు 27 శాతం మంది ప్రజలు ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారని, రెండు శాతం మందికి ఖచ్చితంగా చెప్పలేమని సర్వేలో వెల్లడైందని ప్రకటించింది.