Local Body Elections : జనవరిలో స్థానిక సంస్థలు ఎన్నికలు? కారణం ఇదే ?
Local Body Elections : శాసనసభ ఎన్నికల సమరం పూర్తయింది. సార్వత్రిక ఎన్నికల పోరు ముగిసి అందరూ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. ఇప్పటికే అధికారులు కసరత్తు చేస్తుండగా, ఇటు అన్ని పార్టీల్లో చేరికలు షురూ అయ్యాయి. పదవులు ఆశిస్తున్న నేతలు కండువాలు మారుస్తూ… టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. జూన్ నెలఖారులో నిర్వహిస్తారని ప్రచారం జరిగినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలను మరికొద్ది నెలలపాయి వాయిదా వేయనున్నారా..? అన్న సందేహాలు వస్తున్నాయి.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు… విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను సర్కార్ మరో నాలుగైదు నెలల తర్వాత నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసిన తర్వాతే ఎన్నికలను నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందుకు మరో నాలుగైదు నెలల సమయం పడుతుందని అధికారుల సూచిస్తున్నారు. ఈ మేరకు ఈ ఎన్నికలను జనవరిలో జరిపే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరిలో పంచాయితీ, మున్సిపాలిటీలకు వెంటవెంటనే ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
జనవరిలో వరుసగా సర్పంచ్, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ అనంతరం మున్సిపల్ ఎలక్షన్లను నిర్వహించాలని సర్కార్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచేందుకు చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు నాలుగైదు నెలల సమయం పడుతుందని అధికారుల సూచన మేరకు జనవరిలో ఒకదాని తర్వాత ఒక ఎన్నికలను నిర్వహించే ఉద్దేశంతో రేవంత్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.