Loan Waiver : మూడు విడతల్లో రుణమాఫీ.. ఎప్పటిలోగా పూర్తవుతుందంటే..

Loan Waiver

Loan Waiver Schemes, CM Ravanth Reddy

Loan Waiver : తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ తెలిపారు. రుణమాఫీపై బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మూడు దఫాలుగా రుణమాఫీ చేయనున్నట్లు తెలిపారు సీఎం. రేపు లక్ష వరకు, ఈ నెలాఖరులోగా లక్షన్నర, ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజాభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో రైతు రుణమాఫీ, రైతు వేదికల్లో సంబరాలపై కాంగ్రెస్  నేతలు చర్చించారు. రేపు లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీ చేస్తామన్నారు. తొలి విడతగా 7 వేల కోట్ల రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారాయన. నెలాఖరులోగా లక్షన్నర వరకు.. ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు..ఆగస్టు 15లోపు 2 లక్షల రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని సీఎం తెలిపారు. రైతు రుణమాఫీపై కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే.. కష్టమైనా రుణమాఫీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రేపటి నుంచి జరగబోయే రైతు రుణమాఫీ గురించి 20 సంవత్సరాల వరకు చెప్పుకునేలా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంపైనా విమర్శనాస్త్రాలు సంధించారు రేవంత్ రెడ్డి. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్‌ 28 వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారని రేవంత్ ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి లబ్ధిదారులందరికీ రుణమాఫీ చేస్తున్నామన్నారు. రేషన్‌కార్డులు లేని 6 లక్షల మంది అన్నదాతల రుణాలను మాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ చేసేందుకు రూపాయి రూపాయి పోగేశామని చెప్పారు. రూ.2 లక్షలు ఒకేసారి మాఫీ చేసేందుకు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపామన్నారు.  పెద్ద ఎత్తున రుణమాఫీ జరుగుతున్న నేపథ్యంలో ప్రతీ కార్యకర్త రుణమాఫీ గురించి ప్రచారం చేయాలని  పిలుపునిచ్చారు భట్టి విక్రమార్క.

TAGS