CM Revanth : రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ పథకం అమలు నిబంధనలు చాలా కఠినంగానే ఉన్నాయి. ఈ పథకానికి ఆదాయపు పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషద్ చైర్మన్ లు, రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్నవారిని కేంద్ర ప్రభుత్వం అనర్హులుగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలనే రాష్ట్రంలో రైతు రుణమాఫీ పథకానికి అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేంద్రం నిబంధనలు అమలు అయితే మాత్రం కేవలం వ్యవసాయం మీద ఆధారపడి ఉండి, ఋణం తీసుకున్న రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కేంద్రం అమలు చేస్తున్న నిబంధనలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తరువాతనే నిర్ణయం తీసుకుకునే అవకాశం కనబడుతోందని పార్టీ వర్గాల సమాచారం.
మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉంది అనేవిషయంతో సంబంధంలేదు. ఆ భూములో పంటలు పండుతున్నాయా లేదా అనేది కూడా అనవసరం. భూమికి పట్టా పాస్ పుస్తకం, బ్యాంకు పాసు పుస్తకం వ్యక్తి పేరు మీద ఉంటె చాలు రైతు బందు నిధులు ఆ వ్యక్తి బ్యాంకు అకౌంట్ లో జమ అవుతాయి. రైతు బందు పథకం కింద పెట్టుబడి తీసుకున్న వ్యక్తి రైతా, లీడరా, ప్రభుత్వ ఉద్యోగా అనే విషయాలతో సంబంధం లేకుండనే ఆ పథకానికి అర్హులయ్యారు.
ఇప్పుడు ప్రభుత్వం మారింది. పథకం అమలుపై కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. రైతు భరోసా పేరుతో అసలైన రైతుకు వర్తింపచేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకానికి ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ ఉద్యోగులను దూరంగా ఉంచాలనే నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఆర్థికంగా వెనుకబడిన రైతు కుటుంబాలకే రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలను అమలు చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. రుణమాఫీ అమలుకు నిబంధనలను తయారు చేయాలనీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా జారీచేసినట్టు సమాచారం.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణ మాఫీ పై హామీ ఇచ్చారు. ఆగష్టు పదిహేను తేదీలోగా రైతు రుణమాఫీ చేసి తీరుతానని ప్రకటించారు. అందుకు కట్టుబడి రేవంత్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష, సమావేశాలను నిర్వహిస్తున్నారు.