JAISW News Telugu

Firecrackers factory : బాణసంచా తయారీ కేంద్రంపై పిడుగు.. ఇద్దరి మృతి

firecrackers factory : బాణసంచా తయారీ కేంద్రంపై పిడుగుపడి ఇద్దరు మహిళలు సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని సూర్యారావుపాలెంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. తణుకు మండలం వెంకట్రాయపురానికి చెందని వేగరోతు రామశివాజీ రెండేళ్ల కిందట ఇక్కడ బాణసంచా తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు. సాయి ఫైర్ వర్క్స్ పేరిట ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో మందుగుండు సామగ్రి తయారు చేస్తున్నారు. యజమాని రామశివాజీతో పాటు ఆయన భార్య శ్రీవల్లి సహాయంగా ఉంటారు. వారితో పాటు ప్రతిరోజు తణుకు, ఇతర ప్రాంతాలకు చెందిన కూలీలు ఆటోలో వచ్చి పనిచేస్తుంటారు. బుధవారం నిర్వాహకులైన భార్యాభర్తలతో పాటు మొత్తం 18 మంది పనిలోకి వచ్చారు. ఈ ప్రాంతంలో కొన్ని రోజులుగా పొడి వాతావరణం ఉండగా.. బుధవారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది.

సాయంకాలం సుమారు 5 గంటల సమయంలో గాయపడి కొబ్బరిచెట్టుపై పిడుగు పడి మంటలు చెలరేగాయి. సమీపంలోనే ఉన్న ఫైర్ వర్క్సుకు అంటుకోవడంతో భారీ విస్ఫోటం జరిగి కేంద్రం మొత్తం భస్మమైంది. ఈ ప్రమాదంలో యజమాని భార్య వేగిరోతు శ్రీవల్లి (42) తో పాటు గుమ్మడి సునీత (35) సజీవ దహనమయ్యారు. కడిమి కుమారి (50), చుక్క పెద్దింట్లు (45), మందలంక కమలరత్నం (40), నీలం లక్ష్మి (45), విప్పర్తి వెంకటేశ్వర రావు (50) తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని తణుకు ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు తదితర అధికారులు పరిశీలించారు.

ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను అదేశించారు. ఈ సంఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ చెప్పారు.

Exit mobile version