Onion Exports : ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత
Onion Exports : దేశంలో ఉల్లి ఎగుమతులపై విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని, తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు కొనసాగుతామని పేర్కొంది. అయితే, కనీస ఎగుమతి ధరను టన్నుకు 550 డాలర్లుగా (రూ.45,860) నిర్ణయించింది. మహారాష్ట్రలో పోలింగ్ జరుగనున్న వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోండం గమనార్హం.
దేశంలో ఉల్లి ధరలను అదుపులో ఉంచేందుకు గత ఏడాది కేంద్రం తొలుత ఉల్లి ఎగుమతులపై కనీస ధరను టన్నుకు 800 డాలర్లకు పెంచుతూ అక్టోబర్ 28న నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 8న పూర్తిగా నిషేధం విధించింది. మార్చి 31 వరకు ఈ ఆదేశాలు అమలవుతాయని పేర్కొంది. ఆ గడువును కేంద్రం మళ్లీ పొడిగించింది. ఉల్లి ఎగుమతులపై శుక్రవారం 40 శాతం సుంకాన్ని విధించిన కేంద్రం శనివారం ఆంక్షలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.