Voting Process : ఓటు ఇలా వేద్దాం..పూర్తి అవగాహన మీకోసం..
Voting Process : ఏపీ, తెలంగాణలో నేడు ఓట్ల పండుగ జరుగనుంది. నగరాలు, పట్టణాల నుంచి ఓటు వేయడానికి తరలివస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యంపై ఇప్పటికే అందరికీ అవగాహన కల్పించారు. సమర్థవంతమైన వ్యక్తిని ఎన్నుకోవడం ఎంత ముఖ్యమో.. ఓటును ఎలా వేయాలో తెలుసుకోవడం మరెంతో ముఖ్యం. కొత్త ఓటర్లకు ఓటు వేయడంపై అవగాహన ఉండదు. పోలింగ్ కేంద్రంలో ఏం చేయాలనే దానిపై వారిలో కొంత ఎగ్జాయిటింగ్ తో పాటు ఆందోళన ఉంటుంది. ఓటు వేసే విధాన ప్రక్రియను పూర్తిగా తెలుసుకుందాం..
ప్రతి గ్రామానికి తమ సమీపంలోనే పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేస్తారు. ఆ పోలింగ్ సెంటర్ పరిధిలో ఉన్న ఓటర్లు.. అక్కడే ఓటును వినియోగించుకుంటారు. అయితే అంతకంటే.. ముందు ఓటర్.. తన ఓటు ఏ పోలింగ్ బూత్ పరిధిలో ఉందో నిర్ధారించుకోవాలి. దీని కోసం అధికారులు ఇచ్చే ఓటర్ స్లిప్ ను పరిశీలించాల్సి ఉంటుంది. అందులో ఏ పోలింగ్ బూత్ పరిధిలో ఓటు ఉందనే వివరాలు ఉంటాయి.
ఇక ఆ స్లిప్ తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటర్ గుర్తింపు కార్డును, అలాగే మనకు సంబంధించిన ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన తర్వాత మనం ఓటు వేసే విధానం ప్రారంభమవుతుంది. పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక సహాయ ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు ఇతర ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల నిర్వహణ బాధ్యతలు చేపడతారు. ప్రిసైడింగ్ అధికారి ఆ పొలింగ్ కేంద్రంలోని అన్ని బాధ్యతలను పర్యవేక్షిస్తారు. ఇక ఓటర్ పోలింగ్ బూత్ లోకి రాగానే అతని ఓటర్ స్లిప్, కార్డును మొదటి పోలింగ్ అధికారి ఓటరు జాబితాలో పరిశీలిస్తారు. అనంతరం జాబితాలోని గుర్తింపు, క్రమం సంఖ్యను గట్టిగా చదువుతారు. ఆ సమయంలో అక్కడే ఉన్న వివిధ పార్టీలకు చెందిన ఏజెంట్లు.. తమ వద్ద ఉన్న జాబితాలో చెక్ చేస్తారు. ఆ ఓటరు నిజమని పోలింగ్ ఏజెంట్లు ద్వారా మొదటి పోలింగ్ అధికారి ధ్రువీకరించుకుంటారు.
అనంతరం అతడు అంతకుముందు ఏమైనా ఓటు వేసి వచ్చాడా అనే సందేహంతో ఎడమ చేతి చూపుడు వేలిని పరిశీలిస్తారు. అనంతరం ఓటరు జాబితాలో ఆ ఓటరు పేరును మార్కు చేసుకుంటారు. ఇదే సమయంలో పురుషులు, స్త్రీలకు, ట్రాన్స్ జెండర్లు ఎంత మంది ఓటు వినియోగించుకునేందుకు జాబితాలో ప్రత్యేకంగా మార్క్ వేస్తుంటారు. ఓటర్ల వివరాలపై ఏటవాలుగా గీత గీయడంతో పాటు అదనంగా మహిళా ఓటరైతే క్రమ సంఖ్య చుట్టూ గీత గీయడం చేస్తారు. అలానే ట్రాన్స్‌జెండర్ అయితే వారి క్రమ సంఖ్యపై స్టార్ గుర్తు వేస్తారు.మొదటి అధికారి వద్ద తనిఖీ పూర్తి అయిన తర్వాత రెండో పోలింగ్ అధికారి వద్దకు ఓటరు వెళ్తారు. ఇక్కడ ఓటర్ కు ఎడమ చేతి చూపుడు వేలుపై చెరగని సిరా ముద్ర వేస్తారు. అనంతరం 17ఏ రిజిస్టర్‌లో ఓటర్ వివరాలు నమోదు చేయడం చేస్తారు. 17ఏ పుస్తకంలో మొత్తం నాలుగు కాలమ్స్ ఉంటాయి. వాటిలో ఓటర్ వివరాలు మొత్తం నమోదు చేసుకుంటారు. మూడో కాలంలో ఓటరు తీసుకొచ్చిన గుర్తింపు కార్డు వివరాలతో పాటు అందులో ఉన్న చివరి నాలుగు అంకెలను అధికారి నమోదు చేసుకుంటారు. ఇక నాలుగో కాలంలో ఓటరు సంతకంతో పాటు వేలిముద్ర తీసుకుంటారు. ఈ ప్రాసెస్ అంతా పూర్తైన తర్వాత ఓటరు జాబితాలోని క్రమసంఖ్య రాసి అధికారి సంతకం చేసి.. ఆ కాగితాన్ని చించి ఓటరుకు అందిస్తారు.
అక్కడ స్లిప్ తీసుకున్న ఓటర్.. పక్కనే ఉన్న మూడో పోలింగ్ అధికారి వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ అధికారి ఓటరు వద్ద నుంచి ఓటర్ స్లిప్ ను తీసుకుంటారు. ఆ తరువాత ఈవీఎంల్లో భాగంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ యూనిట్‌లో బ్యాలెట్‌పై క్లిక్ చేసి ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారు. అలా మూడో పోలింగ్ అధికారి సీపీయూపై క్లిక్ ఇచ్చిన తర్వాత ఈవీఎంలోను పొందుపర్చిన ప్రత్యేక కంపార్ట్ మెంట్ లోకి పంపిస్తారు. అయితే అక్కడ ఓటర్ పరిశీలించాల్సిన విషయం ఏమిటంటే.. మూడో ప్రెసైడింగ్ అధికారి బ్యాలెట్ ఇచ్చినప్పుడు కంట్రోల్ యూనిట్‌లో ఎరుపు లైట్ వెలిగి ఉంటేనే అది ఓటు సిద్ధంగా ఉన్నట్లు ఓటర్ గమనించాలి. ఇక అందులోకి వెళ్లిన ఓటరు తనకు నచ్చిన పార్టీ గుర్తుపై ఓటు వేశాక బీప్ శబ్దం రావడంతో ఎరుపు లైట్ ఆగిపోతుంది. ఆతర్వాత వీవీప్యాట్ లో మనం ఎవరికి ఓటు వేశామో ఒక స్లిప్ వస్తుంది. ఏడు సెకన్లకు ఆ స్లిప్ బాక్స్ లో పడిపోతుంది. దీంతో తమ ఓటు పూర్తి అయినట్లు ఓటర్ భావించవచ్చు. అనంతరం అక్కడి నుంచి ఎగ్జిట్ ప్రాంతం నుంచి బయటకు వచ్చేస్తారు.