Ponnam : దసరాకు ఈ ప్రతిజ్ఞ చేద్దాం.. మంత్రి పొన్నం విజ్ఞప్తి
Ponnam : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రిగా, ఒక తల్లికి బిడ్డగా ఒక్క మాట చెబుతా దయచేసి వినాలని కోరారు. రోడ్డు ప్రమాదాల ద్వారా భారతదేశంలో సంవత్సరానికి సగటున 1.60 లక్షల మంది చనిపోతున్నారని, అదే తెలంగాణలో సగటున రోజుకు 20 మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని తెలిపారు.
ప్రమాదం చెప్పి రాదు కనుక మన జాగ్రత్తలో మనం ఉండాల్సిన బాధ్యత మనదేని చెప్పారు. దసరా చెడుపై మంచి విజయం సాధించిన దానికి గుర్తుగా కుటుంబ సభ్యులందరం కలిసి ఆయుధపూజ చేసే సమయంలో ఒక ప్రతిజ్ఞ చేద్దామని అన్నారు. ‘‘ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం.. హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకుందాం’’ అని అందరూ ప్రతిజ్ఞ చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మద్యం తాగి వాహనం నడపడం ప్రమాదానికి సూచిక అంటూ.. అందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు అని చెప్పారు. ఇక చివరగా ఒక భద్రత సందేశం వేల మంది ప్రాణాలు కాపాడుతుందని తెలిపారు.