NRI News : ‘‘పుట్టిన నేలకు పెట్టుబడులతో రుణం తీర్చుకుందాం..’’: మేరీల్యాండ్‌లో కూటమి విజయోత్సవ సంబరాలు
NRI News : ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభంజనానికి వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి 11సీట్లకే పరిమితం అయింది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిపోయిందని.. తన విజన్ తో మళ్లీ అభివృద్ధిని పరుగులు పెట్టించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు రావాలని, కంపెనీలు స్థాపించాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఆనందోత్సవాల్లో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలోని మేరిల్యాండ్ రాష్ట్రంలో కూటమి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్, రామోజీరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రముఖ ప్రవాస వైద్యులు డా. యడ్ల హేమప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధికి ప్రవాసులు ముందుకురావాలని, పెట్టుబడులు పెట్టి, పరిశ్రమలు స్థాపించి రాష్ట్రంలోని యువతకు ఉద్యోగావకాశాల కల్పనకు తోడ్పడాలని కోరారు.
ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, జూలకంటి బ్రహ్మారెడ్డి, గుంటూరు మిర్చియార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పొట్లూరి భాస్కరరావు తదితరులు ప్రసంగించారు. టీడీపీ ప్రభుత్వ కార్యాచరణను వివరించారు. వేడుకలో శ్రీనాథ్ రావుల, శివ నెలకుదిటి, సత్యనారాయణ మన్నె, భాను మాగులూరి, శ్రీనివాస్ దామ, రాజా రావులపల్లి, శివ నెల్లూరి, రాజశేఖర్ చెరుకూరి, హరీష్ కూకట్ల, శ్రీనివాస్ సామినేని, శ్రీను పోతు, సుందర్ క్రోసూరి, మురళి ముల్పురి, హర్ష పేరమనేని పాల్గొన్నారు.