Viral Video : ఏపీలో ఎన్నికల ప్రచారం ముగిసింది. నిన్నటిదాక గోల పెట్టిన మైకులు మూగబోయాయి. ఇక అసలైన పోల్ మేనేజ్ మెంట్ ఇవాళ, రేపు జరుగనుంది. ఓటర్లను మభ్యపెట్టడానికి, వారిని తమ వైపు తిప్పుకోవడానికి గుట్టుచప్పుడు కాకుండా ప్రలోభాల పర్వం నేడు సాగనుంది. అభ్యర్థుల గెలపోటములను ప్రభావితం చేసే రోజు ఇది. డబ్బులు, మద్యం పంపిణీ చేసి ఓటర్లను ప్రభావితం చేయనున్నారు. ఓటు విలువను చెబుతూ ఎంతో మంది అవగాహన కల్పిస్తున్నారు. చివరకు మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రదూడ్ కూడా ఓటు విలువను, ప్రాధాన్యాన్ని చెబుతూ ప్రచారం చేశారు. ఈక్రమంలో ఓ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చిట్టిపొట్టి మాటలతో ఆ చిన్నారి సందేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె మాటల్లో అసలు ఏముందంటే..
‘‘ఎలక్షన్లు వచ్చేశాయి..ఈ సారైనా సరైనవారిని గెలిపించండి. మళ్లీ ఐదేళ్ల తర్వాత గాని ఈ అవకాశం రాదు. మీరు డబ్బులకు ఓట్లు అమ్ముకోవడం ఎప్పుడు మొదలుపెట్టారో.. అప్పుడే ప్రజలకు, ఎమ్మెల్యేలకు మధ్య ప్రజా సంబంధాలు పోయి వ్యాపార సంబంధాలు మొదలయ్యాయి. అలా కాకుండా కులం, మతం, డబ్బులు కాకుండా ఫలానా వారిని గెలిపిస్తే మనకు మంచి చేస్తారనే వారిని ఎమ్మెల్యేను చేసి.. అప్పుడు అతడు మీకు సేవ చేయకుంటే చొక్కా పట్టుకుని ఎందుకు సేవ చేయడం లేదురా అనే హక్కు మీకు ఉంటుంది.. అలా కాకుండా నోట్లకు, సారా ప్యాకెట్లకు, చీరలకు అమ్ముడుపోయినంత కాలం ఈ లంచగొండి తనం తీరు..మంచి నాయకుడు రాడు..మార్పు మన నుంచే రావాలి..ఆలోచించండి’’ అంటూ ఆ చిన్నారి సందేశం అందరినీ ఆలోచింపచేస్తోంది. చిన్నారికి ఉన్న తెలివి మనకు లేకపాయే అనుకుంటున్నారు. ఆ చిన్నారి చెప్పినట్టు ఏపీ భవిష్యత్ కోసం, పిల్లల ఉపాధి కోసం సరైన నాయకుడిని ఎంచుకుందాం..ఐదేండ్ల కింద చేసిన తప్పును మళ్లీ చేయకుండా సమర్థుడిని ఎన్నుకుందాం.