Minors arrested : సెల్ ఫోన్ కోసం న్యాయవాదిపై దాడి… ఇద్దరు మైనర్ల అరెస్టు
minors arrested : హైదరాబాద్ లోని ఐమాక్స్ వద్ద మంగళవారం న్యాయవాది కల్యాణ్ పై దాడి చేసి మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. ఈ కేసును ఛేదించిన సెంట్రల్ జోన్ పోలీసులు ఇద్దరు నిందితులైన మైనర్లను అరెస్టు చేశారు. ఈ మేరకు అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అబిడ్స్ పోలీసు అధికారులు వివరాలు వెల్లడించారు. మంగళవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధి గన్ ఫౌండ్రిలోని ప్రసాద్ అపార్ట్ మెంట్ వద్ద వాచ్ మెన్ ను కత్తితో బెదిరించి ఇద్దరు మైనర్లు మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి ఐమాక్స్ వద్దకు వెళ్లారు. 5 గంటల సమయంలో అక్కడ వాకింగ్ చేస్తున్న న్యాయవాది కల్యాణ్ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. కల్యాణ్ ప్రతిఘటించడంతో కత్తితో బెదిరించారు. ఈ ఘటనలో కల్యాణ్ గాయపడ్డారు. సెంట్రల్ జోన్ పరిధిలో రెండు ఒకే తరహా కేసులు నమోదు కావడంతో డీసీపీ యాదవ్ నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రాంనగర్ ఫిష్ మార్కెట్ వద్ద ఓ మైనర్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. అతని వద్ద ఉన్న వాచ్ మన్ మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఇచ్చిన వివరాల ఆధారంగా చంద్రాయణగుట్ట బండ్లగూడ వద్ద మరో మైనర్ ను అదుపులోకి తీసుకొని న్యాయవాది స్మార్ట్ ఫోన్, దాడికి ఉపయోగించిన కత్తి, హోండా యాక్టివా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారి ఆధార్ కార్డుల ప్రకారం వారు మైనర్లుగా తేలడంతో, వారి వయసును నిర్ధారించేందుకు ఉస్మానియా ఆస్పత్రిలో టెస్టు కోసం పంపించారు. గతంలో వారిపై ముషీరాబాద్ పీఎస్ పరిధిలో మొబైల్ స్నాచింగ్ కేసు నమోదైంది.