Deputy CM Pawan Kalyan : సనాతన ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే వ్యక్తిగా.. వారాహి డిక్లరేషన్ ను వేంకటేశ్వరుని పాదాల సాక్షిగా ప్రకటిస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తిరుపతి బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పూలే కూడలి వద్ద పవన్ కల్యాణ్ వారాహి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారాహి డిక్లరేషన్ అంశాలు పవన్ వివరించారు.
సనాతన ధర్మ పరిరక్షణకు ఒక బలమైన చట్టం అవసరం. దేశమంతా అమలయ్యేలా వెంటనే ఒక చట్టం తేవాలి. చట్టం అమలుకు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ఏటా నిధులు కేటాయించాలి. ప్రసాదాల్లో వాడే వస్తువుల నాణ్యతను ధ్రువీకరించే విధానం తేవాలి. మన దేవాలయాలు విద్య, కళలు, ఆర్థిక కేంద్రాలుగా విలసిల్లాలి. మన ఆలయాలు పర్యావరణ పరిరక్షణ, సంక్షేమ కేంద్రాలుగా మారాలని పవన్ తెలిపారు. హిందువుగా సనాతన ధర్మాన్ని తాను ఆరాధిస్తానని, మిగతా మతాలను గౌరవిస్తానని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం చూపేది, ఇతర మతాలను గౌరవించేది సనాతన ధర్మమని పవన్ తెలిపారు. సనాతన ధర్మం మనుషులు ఒక్కరే సుఖంగా ఉండాలని మాత్రమే కోరుకోలేదని, ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి సుఖంగా ఉండాలని కోరుకుంటుందని వెల్లడించారు. ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు అని, కలియుగంలో ధర్మానికి ప్రతిరూపం వేంకటేశ్వరస్వామి అని పేర్కొన్నారు.