Justice not Blind : లాయర్ ఆఫీసులు, కోర్టుల్లో న్యాయ దేవత (లేడీ ఆఫ్ జస్టిస్) బొమ్మను చూసిన ఎవరైనా ఫస్ట్ అనుకునేది చట్టం గుడ్డిది అని. అంటే దీని అర్థం చట్టానికి కళ్లు లేవు అందరినీ సమానంగా చూస్తుందని. కానీ ఇక నుంచి చట్టానికి కళ్లు ఉన్నాయి.. అందరినీ సమానంగానే చూస్తుంది అని చెప్పేందుకు సుప్రీం కోర్టులో కొత్త న్యాయ దేవత బొమ్మ సూచిస్తుంది. గతంలో న్యాయ దేవతగా పిలుచుకునే లేడీ ఆఫ్ జస్టిస్ ఒక చేతితో త్రాసు మరో చేతిలో కత్తి ఉండేది. ఇక కళ్లకు నల్లటి దారంతో గంతలు కట్టి ఉండేది. కానీ ఇప్పుడు ఆ విగ్రహం రూపం మారింది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో కొత్త విగ్రహం ఆవిష్కరించారు. ఇందులో ఒక చేతితో త్రాసు మరో చేతితో కత్తికి బదులుగా రాజ్యాంగం పుస్తకం. కళ్లకు గంతలు లేకుండా ఉంటుంది. ఇందులో మరో సంప్రదాయ అంశాన్ని కూడా జోడించారు. అది గతంలో లేడీ ఆఫ్ జస్టిస్ కు గౌను ఉండేది. కానీ కొత్త విగ్రహంలో గౌనుకు బదులు భారత సంప్రదాయమైన చీరను కట్టారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల లైబ్రరీలో ఉన్న ఈ విగ్రహం, దేశంలో న్యాయం గుడ్డిది కాదని, అందరినీ సమానంగా చూస్తుందని తెలియజేస్తుందని చంద్రచూడ్ తెలిపారు.