Ethiopia : భారీ వర్షాలతో ఇథియోపియాలో మట్టిచరియలు విరిగిపడిన ఘటన వందల కుటుంబాల్లో విషాదం నింపింది. మట్టిచరియలు విరిగిపడడంతో మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 257కి చేరినట్లు ఐక్యరాజ్య సమితి మానవతా సాయం వ్యవహారాల విభాగం తెలిపింది. ఆది, సోమవారాల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో కిన్ చో షాచా గోజ్ డీ ప్రాంతంలో తొలుత మట్టిచరియలు విరిగిపడ్డాయి. అక్కడ సహాయక చర్యలు చేస్తున్న క్రమంలో మరోసారి అవి విరిగిపడ్డాయి. దీంతో సహాయక బృందాలతో పాటు, అక్కడ ఉన్న ప్రజలు సైతం శిథిలాల్లో చిక్కుకున్నారు. దీంతో వందలాది కుటుంబాల్లో పెను విషాదం ఏర్పడింది.
ఈ ఘటనల్లో మృతుల సంఖ్య 500 వరకు పెరగవచ్చని స్థానిక అధికారులను ఉటంకిస్తూ యూఎన్ మానవతా సాయం వ్యవహారాల విభాగం పేర్కొంది. ఆ ప్రాంతం నుంచి దాదాపు 15 వేల మందికి పైగా బాధాతులను ఖాళీ చేయాలని తెలిపింది. మరోవైపు, ఇథియోపియా ప్రధాని అబీఅహ్మద్ శుక్రవారం ఈ ఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించే అవకాశం ఉంది. ఈ ఘటన జరగడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.