Chandrababu : ‘కుర్చీ మడతపెట్టి..’ చంద్రబాబు నోట ఊర మాస్ డైలాగ్.. జగన్ కు స్ట్రాంగ్ వార్నింగ్..
Chandrababu : ‘కుర్చీ మడతపెట్టి’ అనే డైలాగ్ కు ‘ఇయర్ ఆఫ్ ది డైలాగ్’ అవార్డు ఇవ్వాల్సి రావొచ్చు కాబోలు. కుర్చీ మడతపెట్టి కొడితే..అనే డైలాగ్ ను వరంగల్ పాషా తాత ఏ క్షణాన అన్నాడో కాని..ఇప్పుడిది రెండు తెలుగు రాష్ట్రాలో ఫుల్ మాసీ డైలాగ్ అయ్యింది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల దాక ఈ డైలాగ్ ను తరుచుగా వాడుతున్నారు. ఈ డైలాగ్ ఇంత పాపులర్ కావడంతో సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా తన సినిమాలో పాటగా పెట్టుకున్నారు అంటేనే తెలస్తుంది..ఆ డైలాగ్ కు ఎంత క్రేజ్ ఉందో.
గుంటూరు కారంలో ఆ పాట ఎంత హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. ఆ సినిమాల్లోని అన్ని పాటల్లోకెల్లా ఈ పాటే జనాల్లోకి ఎక్కువగా వెళ్లింది. సినిమా హిట్ టాక్ తెచ్చుకుందంటే కారణం ఈ పాట అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఈ పాట సోషల్ మీడియానే కాదు.. హైదరాబాద్ పబ్బుల్లోనూ, పల్లె గల్లీ డీజేల్లోనూ మోత మోగిపోతుంది.
ఇక కుర్చీ మడతపెట్టి డైలాగ్ ను రాజకీయ నాయకులు సైతం ఎడాపెడా వాడేసుకోవడం విశేషమే. ఏకంగా సీనియర్ పొలిటిషియన్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడి నోటి వెంట కూడా ఈ డైలాగ్ రావడం..దీని పాపులారిటీ ఎంతో తెలుస్తోంది. ఫుల్ మాసీగా వార్నింగ్ ఇవ్వడానికి ఈ డైలాగ్ ఉపయోగపడుతుందంటే.. కుర్చీ తాతకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేశ్ రాసిన ‘విధ్వంసం’ పుస్తకావిష్కరణ అమరావతిలో జరిగింది. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఐదేళ్లుగా మూడు రాజధానులు జపం చేసిన వైసీపీ ప్రభుత్వం..ఇప్పుడు నాలుగో రాజధాని పేరు తెస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఈ ఐదేళ్లు విధ్వంసం కాదు అరాచకం జరిగిందన్నారు. ‘ప్రజావేదిక కూల్చి ఆ శకలాలను చూసి నేను ప్రతీరోజు బాధపడాలి అని చేసిన వ్యక్తిని సైకో గాక ఏమాంటారు? అని ప్రశ్నించారు. నేను ఉండే ఇల్లు కూల్చాలని ఐదేళ్లు చూశారన్నారు.
రాష్ట్రం నుంచి పరిశ్రమలను కూడా తరిమేశారన్నారు. రాష్ట్రాన్ని జగన్ విధ్వంసం చేయాలని కంకణం కట్టుకున్నారని, మద్యం, ఇసుక, మైనింగ్ ఏది కనపడితే అది దోచుకోవడమే పని పెట్టుకున్నారని ఆరోపించారు. ఇక సీఎం చొక్కా మడతపెట్టాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిస్తున్నాడని..అయితే ‘‘టీడీపీ కార్యకర్తలు, జనసైనికులు కుర్చీలు మడతపెడుతారు.. అప్పుడు జగన్ కు కుర్చీనే ఉండదు..పిచ్చిపిచ్చి కూతలు కూస్తే జనం ఊరుకోరు’’ అని జగన్ కు చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు.