Kumari Aunty : వరల్డ్ వైడ్ గా ఫేమ్ కానున్న కుమారి ఆంటీ.. డాక్యుమెంటరీకి నెట్‌ఫ్లిక్స్ ప్లాన్!?
ఆమె ఫుడ్ కోర్ట్ నిత్యం కస్టమర్లతో కిట కిటలాడుతుంది. అంతా బాగుంటే ఆమె వార్తల్లో వ్యక్తి ఎందుకవుతుంది. ఆమె ఫుడ్ స్టాల్ వల్ల ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతుందని ట్రాఫిక్ పోలీసులు కుమారి ఆంటీపై కేసులు నమోదు చేసి.. ఫుడ్ స్టాల్‌కు తీసేయించారు. అప్పటి వరకు కేవలం సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుమారీ ఆంటీ ఒక్కసారిగా మేయిన్ స్ట్రీమ్ మీడియాకు ఎక్కారు. మాధాపూర్ తో సహా హైదరాబాద్ లో ఎక్కడ విన్నా కుమారీ ఆంటీ ఫుడ్ కోర్ట్ గురించే అది ఎంతలా వ్యాపించిందంటే సీఎం రేవంత్ రెడ్డి ఆ విషయంపై నేరుగా స్పందించేంత వరకు. ఆమెను ఎలాంటి ఇబ్బందులు పెట్టవద్దని పోలీసులకు ఆదేశాలిచ్చేంతగా..
ఇంతటి విక్టరీ సాధించిన కుమారీ ఆంటీ గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇక చిన్నా చితగా యూట్యూబ్ ఛానళ్లు రంగంలోకి దిగాయి. ఆమె విజయం, పయనం, గాధ అంటూ రక రకాలుగా ఇంటర్వ్యూలు చేశారు. ఇప్పుడు కొన్ని పెద్ద ఛానళ్లు కూడా ఆమె ఇంటర్వ్యూ తీసుకుంటున్నాయి. ఇంతలా పాపులర్ అయిన ఆమె గురించి సోషల్ మీడియాలో మరో వార్త వినిపిస్తుంది. ఓటీటీల్లో బిగ్గెస్ట్ ప్లాట్ ఫారం అయిన నెట్‌ఫ్లిక్స్ ఆమెపై ఓ డాక్యుమెంటరీ తీయనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
మూడు ఎపీసోడ్ల నిడివి ఉండే ఒక డాక్యుమెంటరీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని, దానికి ‘ఫేమ్’ అనే పేరును కూడా పెట్టినట్లు వినిపిస్తుంది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది ఎంత వరకు నిజం అన్నది తెలియలేదు.
ఇది నిజమేనని కొన్ని వెబ్ సైట్లు ఏకంగా కమ్మటి వార్తలు వండేశాయి. డాక్యుమెంటరీలో ఆమె నేపథ్యం.. సొంత ఊరు నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఇంత ఫేమస్ ఎలా అయ్యిందని, ఆమె ప్రయాణాన్ని చూపించనున్నారంటూ రుచికరంగా వడ్డిస్తున్నారు. ప్రస్తుతం కుమారి ఆంటీ దగ్గినా.. తుమ్మినా సోషల్ మీడియాలో తుపానే వచ్చేలా ఉంది.