KTR : ఆరు గ్యారెంటీల హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిని అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే రెండు గ్యారెంటీలను అమలుచేసింది. ఇక మిగతా వాటి అమలు కోసం మొన్నటిదాక ప్రజాపాలన పేరిట దరఖాస్తులు తీసుకున్నది. సదరు గ్యారెంటీల అమలుకు ఇవే ప్రతిపాదిక అని ప్రభుత్వం చెప్పడంతో లక్షలాదిగా జనాలు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 1.25కోట్ల దరఖాస్తులు వచ్చాయి. వీటిని ప్రస్తుతం డాటా ఎంట్రీ చేస్తున్నారు.
అత్యంత కీలకమైన ఈ దరఖాస్తులను అధికారులు జాగ్రత్తగా భద్రపరచాలి. అయితే వీటి భద్రతపై ఇప్పుడు సందేహాలు తలెత్తుతున్నాయి. తాజాగా ఈ దరఖాస్తులు రోడ్డుపై గాల్లో ఎగురుతూ కనిపించాయి. హైదరాబాద్ లోని హయత్ నగర్ సర్కిల్ కు చెందిన అప్లికేషన్లు బాలానగర్ ఫ్లైఓవర్ పై చిందరవందరగా కనిపించడంతో వాహనదారులు చూసి అవాక్కయ్యారు. కూకట్ పల్లిలోని ప్రైవేట్ ఏజెన్సీ లో కంప్యూటరీకరించేందుకు వేలాది దరఖాస్తులను ర్యాపిడో స్కూటీపై అట్టపెట్టెలో తీసుకెళ్తుండగా తాడు తెగి రోడ్డుపై పడ్డాయి. వీటిని చూసిన జనాలు ఆందోళన చెందారు. జాగ్రత్తగా భద్రపరిచి ప్రభుత్వ కార్యాలయాల్లో డాటా ఎంట్రీ చేయాల్సిన ప్రజలకు సంబంధించిన కీలక సమాచారం ఉన్న దరఖాస్తులను ఇలా నిర్లక్ష్యంగా ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించడంపై మండిపడుతున్నారు.
తాజాగా ఈ ఘటనపై కేటీఆర్ స్పందించారు. దరఖాస్తుల్లో కోట్లాది మందికి సంబంధించిన వ్యక్తిగత డాటా ఉందని, ఇది సైబర్ నేరగాళ్ల చేతికి చేరకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. ఎవరైనా కాల్ చేసి పెన్షన్, ఇల్లు ఇస్తామంటే ఓటీపీ షేర్ చేయవద్దని తెలంగాణ ప్రజలను హెచ్చరించారు. ఓటీపీ షేర్ చేస్తే ఏం కాదంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. భట్టి మాటలు నమ్మి అనవసరంగా డబ్బు పోగొట్టుకోవద్దని చెప్పారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకండి.. బీ కేర్ ఫుల్ అంటూ హెచ్చరించారు.
కాగా, ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా జనాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇండ్ల కోసం, పింఛన్ల కోసం, గ్యాస్ బండ రాయితీ కోసం..దరఖాస్తు చేసుకున్నారు. పేదరికంలో ఉన్న తమకు ప్రభుత్వ పథకాల ద్వారానైనా కొద్దిగా ఉపశమనం కలుగుతోందని భావించారు. ఎన్నో ఆకాంక్షలతో చేసుకున్న దరఖాస్తులు ప్రైవేట్ వ్యక్తుల చేతికి చేరడంపై ఆందోళన చెందుతున్నారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.