KTR : కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం.. ప్రభుత్వం ఫిక్స్ చేసిన డేట్ ఇదే!
KTR: ‘ఫార్ములా-ఇ’ కార్ రేసింగ్ ఇష్యూలో మున్సిపల్ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఉచ్చు బిగుసుకుంటోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ–కార్ల రేస్ నిర్వహణ సంస్థ ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈవో)కు కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకు అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకుండానే రూ.55 కోట్లు చెల్లించారన్న అంశాన్ని ఆధారంగా చేసుకుని.. కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకు ఈ-కార్ రేస్ మేనేజ్మెంట్ కంపెనీ ఫార్ములా-ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ)కి రూ.55 కోట్లు చెల్లించారు. దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సియోల్ పర్యటనలో రాజకీయ బాంబులు పేలబోతున్నాయంటూ చేసిన వ్యాఖ్యలు.. తాజాగా అరవింద్ కుమార్కు ఏసీబీ నోటీసులు.. కేటీఆర్ బావమరిది జన్వాడ నివాసంలో దాడులు కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందనడానికి అన్నీ సంకేతాలే.
ఫార్ములా-ఈ రేస్పై ఏసీబీ విచారణ జరిపించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ లేఖ రాయగా.. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలోని అధికారులు ఫార్ములా-ఈ రేసును విచారిస్తున్నారు. అందులో భాగంగా అరవింద్ కుమార్ కు నోటీసులు జారీ చేసింది. ఈ విచారణలో అతడు వెల్లడించే అంశాలే కీలకం కానున్నాయి. ఫార్ములా–ఈ రేసు అంశంలో విదేశీ సంస్థకు నిధులు బదిలీ అయిన నేపథ్యంలో ఈడీకు కూడా ప్రభుత్వం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఏసీబీ కేసు రిజిస్టర్ చేసిన నేపథ్యంలో ఈడీ కూడా విచారణ చేపట్టవచ్చని భావిస్తున్నారు.