KTR Comments on Devara : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఏదో ఒక విషయంతో మీడియా ముందు కనిపిస్తున్నాడు. ప్రభుత్వంపై విరుచుకుపడేందుకు ఏదో ఒక విషయాన్ని మోసుకస్తున్నాడు. ఇటీవల ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఏ అంశాలు లేవు కాబోలు అందుకే సినిమా ఈవెంట్లపై పడ్డాడు. గత ఆదివారం దేవర చిత్ర బృందం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేసింది. అయితే, అభిమానులు ఊహించని విధంగా వేదిక సామర్థ్యాన్ని మించి రావడంతో గందరగోళం ఏర్పడి, ఫర్నీచర్, ఇతర వస్తువులకు నష్టం వాటిల్లింది. చివరికి ఈవెంట్ మొత్తం రద్దు చేయాల్సి వచ్చింది.
ఇప్పుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను సరిగ్గా నిర్వహించలేకపోయిందని విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రతీ అంశాన్ని సరిగ్గా నిర్వహించిందన్న ఆయన. కాంగ్రెస్ ఘోరంగా విఫలమవుతోందన్నారు.
కేటీఆర్ మాట్లాడుతూ, ‘మత విభేదాలు, ప్రజల మధ్య విభేదాలు, ఇతర అంతరాయాలు లేకుండా హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ ఎంతో కృషి చేశారు. ట్రాఫిక్ నిర్వహణ, గణేష్ నిమజ్జనం, బోనాల ఊరేగింపు, ముహర్రం ఊరేగింపు ఇలా ప్రతి అంశాన్ని మన ఎమ్మెల్యేలు, మంత్రులు చూసుకున్నారు. మా హయాంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా సజావుగా జరిగాయి. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. Jr NTR గారు తన సినిమా కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ప్లాన్ చేసారు, దానిని సరిగ్గా నిర్వహించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. వారి పాలన దయనీయంగా ఉంది’ అని కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారిందని కేటీఆర్ అన్నారు. హైడ్రా కూల్చివేతలపై ఆయన ఇంకా మాట్లాడుతూ బాధితులకు BRS పార్టీ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.