Current Bills : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోంది. అధికారం కోసం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. మొదటి విడతలో రెండు గ్యారెంటీలు అమలు చేసింది. ఇంకా నాలుగు హామీలు అలాగే మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ ప్రజలు తొందరపడి కరెంటు బిల్లులు కట్టొద్దని చెబుతున్నారు.
కాంగ్రెస్ నేతలు ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ఇప్పుడు నాలుక కరుచుకుందని అంటున్నారు. రేవంత్ రెడ్డి వారు ముందు ఓ మాట మాట్లాడుతూ తరువాత మాట మార్చడం సహజమేనన్నారు. లోక్ సభ ఎన్నికల తరువాత బీజేపీ కాంగ్రెస్ తో కలిసిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రతి మహిళకు రూ.2500 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కరెంట్ బిల్లులు చెల్లించొద్దని సూచిస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో విద్యుత్ బిల్లులు 200 యూనిట్ల వరకు మాఫీ చేస్తామని చెబుతున్న క్రమంలో వీటిని ఇంకా ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ హామీలు అమలు చేయకపోతే ఊరుకోమని అంటున్నారు. అధికారం కోసం ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ ఏం సమాధానం చెబుతారని అడుగుతున్నారు.
లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని సూచిస్తున్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే అందరు సోనియాగాంధీని లేఖలు రాయాలని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు తీర్చేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.
అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటినా ఇంకా నాలుగు హామీల మీద ఎలాంటి ప్రకటన రాలేదన్నారు. సాధ్యమైనంత త్వరలో హామీలు తీర్చేందుకు నడుం కట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. లేకపోతే కాంగ్రెస్ మెడలు వంచి మరీ అమలు చేయించే బాధ్యత మాపై ఉందన్నారు. రాబోయే కాలంలో దీనిపై మరింత ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు.