కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పిన కేటీఆర్ బుధవారం రాత్రి హైదరాబాద్ లోని నందినగర్లోని తన నివాసానికి చేరుకున్నారు. అయితే లగచర్ల ఘటనకు సంబంధించి కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారంతో బీఆర్ ఎస్ అప్రమత్తమైంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, కార్తీక్ రెడ్డి తదితర నేతలు అక్కడికి చేరుకున్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు నందినగర్ నివాసానికి చేరుకుని కేటీఆర్‌ను కలిశారు. లగచర్ల ఘటన తర్వాత చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. లగచర్ల ఘటనలో ఎలాంటి కుట్ర లేదని, బలవంతపు భూసేకరణపై రైతుల ఆందోళన తప్ప మరేమీ లేదని నేతలు పేర్కొంటున్నారు. పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత విధానాలపై క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధం కావాలని పార్టీ నేతలు నిర్ణయించారు.