KTR Contests Lok Sabha : లోక్ సభ బరిలో కేటీఆర్.. పోటీ చేసేది అక్కడి నుంచే..

KTR Contests Lok Sabha

KTR Contests Lok Sabha

KTR Contests Lok Sabha : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఊహించని రీతిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో బీఆర్ఎస్ పార్టీ షాక్ కు గురైంది. ఈమేరకు ఓటమిపై సమీక్షించుకుంది. ఇంతలోనే లోక్ సభ ఎన్నికలు కూడా వస్తుండడంతో.. కచ్చితంగా ఆ ఎన్నికల్లో సత్తా చూపాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో లోక్ సభ ఎన్నికలను అధినేత కేసీఆర్ కీలకంగా తీసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పులు లోక్ సభ ఎన్నికల్లో పునరావృతం కాకుండా ఉండాలని జాగ్రత్త పడుతున్నారు. అందుకే తెలంగాణలోని 17 నియోజకవర్గాల్లో 16 స్థానాలను గెలుచుకునే దిశగా ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు.

లోక్ సభ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు సీరియస్ గా తీసుకోనున్నాయి. రాజకీయ అవసరాలు, పార్టీల భవిష్యత్ దృష్ట్యా ఈఎన్నికలు అందరికీ కీలకమే. అందుకే అన్ని నియోజకవర్గాల్లోనూ బలమైన అభ్యర్థులనే రంగంలోకి దించాలని భావిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా తన అభ్యర్థుల్లో మార్పులు, చేర్పులు చేయనుంది. అన్ని చోట్లా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని ఇప్పటికే ప్రయత్నాలు చేస్తోంది.

అందులో భాగంగానే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ లోక్ సభ బరిలో నిలువనున్నట్లు సమాచారం. మల్కాజిగిరి లేదా సికింద్రాబాద్ నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ‘‘ఈ అంశంపై చర్చ జరిగినప్పుడు కేటీఆర్ అంత సానుకూలత చూపలేదు అని..అలా అని వ్యతిరేకించనూ లేదు’’ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ తీసుకునే తుది నిర్ణయంపైనే ఇది ఆధారపడి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

లోక్ సభకు కేటీఆర్ పోటీ చేయడం ద్వారా బీఆర్ఎస్ కు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం లభిస్తుందని అంటున్నారు. అలాగే కేటీఆర్ పోటీలో ఉంటే ఆ పాజిటివిటీ మిగతా నియోజకవర్గాల్లోనూ పడుతుందని భావిస్తున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో 17 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ 9 స్థానాల్లో గెలిచింది. 4 బీజేపీ, 3 కాంగ్రెస్, 1 ఎంఐఎం గెలిచాయి. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోనే ఉంది కాబట్టి అంతగా వాటిపై దృష్టి సారించలేదు. కానీ ప్రస్తుత తరుణంలో లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటడం ఆ పార్టీకి చాలా అవసరం.

ఈక్రమంలో కేటీఆర్ పోటీ చేసే అవకాశాలున్న మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఓట్లు పడ్డాయి. మల్కాజిగిరి పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. దీని పరిధిలో బీఆర్ఎస్ కు 9.38లక్షల ఓట్లు రాగా..కాంగ్రెస్ కు 5.38లక్షలు, బీజేపీకి 4.25లక్షలు వచ్చాయి. ఇక సికింద్రాబాద్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 6 బీఆర్ఎస్, 1 ఎంఐఎం గెలుచుకుంది. బీఆర్ఎస్ కు 4.63లక్షలు, కాంగ్రెస్ కు 2.8లక్షలు, బీజేపీకి 2.16లక్షల ఓట్లు వచ్చాయి. ఏ రకంగా చూసినా ఈ రెండు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ కు అద్భుత ఫలితాలే వచ్చాయి. అందుకే బీఆర్ ఎస్ కేటీఆర్ ను ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒకదాని నుంచి పోటీ చేయాలని భావిస్తోంది. దాదాపు మల్కాజిగిరి వైపు మొగ్గు చూపే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి.

TAGS