KTR:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయం దగ్గర పడుతున్నకొద్దీ రాష్ట్రమంతటా తీవ్ర ఉత్కంఠ పెరుగుతోంది. ఎగ్టిల్ పోల్స్ మొత్తం కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, అత్యధిక స్థానాల్ని దక్కించుకుని అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని తేల్చేశాయి. దీంతో కాంగ్రెస్ శ్రేణులు అప్పుడే సంబరాలు మొదలు పెట్టడమే కాకుండా క్యాంపు రాజకీయాలకు తెర లేపింది. మరి కొన్ని గంటల్లో కౌంటింగ్ మొదలు కానున్న నేపథ్యంలో ఫలితాల తరువాత అభ్యర్థులు ఫిరాయింపులకు తెరలేపే అవకాశం ఉందని జాగ్రత్తలు పడటం మొదలు పెట్టింది.
ఇందు కోసం కర్ణాటక కాంగ్రెస్ లీడర్, ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకె శివ కుమార్‌ని రంగంలోకి దించేసింది. నియోజక వర్గాల వారిగా ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో గెలుపొందిన అభ్యర్థులు ఫిరాయింపులకు దిగకుండా ఉండేందుకు డీకె శివకుమార్‌తో సరికొత్త ప్లాన్‌ని రచించింది. అయితే బీఆర్ ఎస్ మాత్రం మూడవ సారి కూడా తామే అధికారం చేపట్టబోతున్నామంటూ ధీమాని వ్యక్తం చేస్తోంది.
ఎగ్జిట్ పోల్స్ తలకిందులవుతాయనే ఆత్మ విశ్వాసంతో గులాబీ పార్టీ కనిపిస్తోంది. ఇప్పటికే కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నామని, డిసెంబర్ నాలుగున కేబినేట్ మీటింగ్‌కు రెడీ అవుతున్నామని సంకేతాలు అందించారు. తాజాగా మంత్రి కేటీఆర్ హ్యాట్రిక్ విక్టరీపై ధీమాని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. `హ్యాట్రిక్ లోడింగ్ 3.0. గెట్ రెడీ టు సెలబ్రేట్ అనే క్యాప్షన్‌ని జోడించి గన్ ఎక్కుపెట్టిన ఫొటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సామిజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి హాట్ టాపిక్ అవుతోంది.
Hattrick Loading 3.0 ?
Get ready to celebrate guys ? pic.twitter.com/4wJRJujU4w
— KTR (@KTRBRS) December 2, 2023