JAISW News Telugu

Krishnavanshi : కృష్ణవంశీ ఎమోషనల్ ఇంటర్వ్యూ..: ఆ సమయంలో ‘నిన్ను సినిమా ఎవరు తీయమన్నారు’ అని శాస్త్రిగారు మందలించారు.. ఎందుకంటే?

Krishnavanshi

Krishnavanshi

Krishnavanshi : దర్శకుడు కృష్ణవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ గోపాల్ వద్ద  అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసినా.. ఆయన ఛాయలు మాత్రం ఈయన సినిమాలో మచ్చుకైనా కనపించవు. రాము డైరెక్షన్ లో దెయ్యాలు, ఫ్యాక్షన్, మాఫియా బ్యాక్ డ్రాప్ గా ఉంటే.. కృష్ణవంశీ మూవీలో పూర్తి విరుద్ధంగా ఫ్యామిలీ, ప్రేమలు, ఎమోషన్ తో కూడిన బ్యాక్ డ్రాప్ తో ఉంటాయి. ఇక కృష్ణవంశీ లైఫ్ లో మరో కీలక భూమికపోషించిన వ్యక్తి పాటల రచయిత సితా రామశాస్త్రి.

మీరు తీసిన ‘అంతఃపురం’లో ‘అసలేం గుర్తుకు రాదు..’ ఈ పాట మీద మీ అభిప్రాయం?
కృష్ణ వంశీ: ఇది ఒక డబుల్‌ఎడ్జ్‌ సాంగ్. ఇళయరాజా మ్యూజిక్‌, చిత్ర స్వరం ఆ సినిమాకు జీవం పోశాయి. దీనికి తోడు సౌందర్య హావభావాలు. రికార్డింగ్‌ పూర్తయి వినగానే మనసు బరువెక్కింది. పాట చిత్రీకరణలో నా పరిస్థితి చెప్పలేను. అంత ప్రాణంగా ప్రేమించిన భర్త చనిపోయాడు. ఆ అమ్మాయి చుట్టూ రాక్షసత్వ పరిస్థితులు. తను అక్కడి నుంచి వెళ్లిపోవాలంటే తను ప్రేమించిన వాడి జ్ఞాపకం (కొడుకు) ఒకటి ఆమె దగ్గర ఉంది. ఈ సమయంలో పాట రావాలి. దుఃఖంలో ఉన్నా కూడా చెప్పలేని ప్రేమ కనిపించాలి. అది రెండు సందర్భాలకు సరిపోవాలి. ఈ పాటలో మీరు ఒక్కొక్క లైన్‌ వింటే అది తెలుస్తుంది. ఆ సందర్భంలో పాట రాయడం ఒక్క శాస్త్రి గారికే సాధ్యం.

మీ సినిమాలోనివి కాకుండా వాస్త్రి గారు రాసిన ఏ సినిమాల్లోని పాటలంటే మీకు ఇష్టం?
కృష్ణవంశీ: చాలా ఉన్నాయి.. తివిక్రమ్‌ ఫస్ట్ మూవీ ‘నువ్వే నువ్వే’లో ‘ఏ చోట ఉన్నా.. నీ వెంట లేనా.. ఎడారి అంత..’ ఈ మధ్య ఎక్కువగా వింటున్నా. ఆయన రాసిన విధానం, చిత్రమ్మ పాడిన తీరు బాగుంది. సిరివెన్నెల, రుద్రవీణలో ‘తరలిరాద తనే వసంతం’, బొబ్బిలి రాజా’లో ‘బలపం పట్టి భామ ఒళ్లో’ ఇష్టం. అంత తుంటరితనం ఆయనకు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు.

మీరు తీసిన వాటిల్లో సిరివెన్నెలకు బాగా నచ్చిన సినిమా ఏంటి?
కృష్ణవంశీ: అంతఃపురం.. ఆయన ఆ సినిమా ఫస్ట్‌ కాపీ చూల్లేదు. థియేటర్‌లో చూశారు. థియేటర్ నుంచి ఇంటికి వెళ్లే ముందే నేను వాళ్ల ఇంటికి వెళ్లా. శాస్త్రి గారు నేరుగా వచ్చి నన్ను కౌగిలించుకొని 5 నిమిషాలు అలాగే ఉండిపోయారు. ఏమీ మాట్లాడలేదు. ‘నీకు తెలుసా నువ్వు ఏం తీశావో’ అన్నారు. ‘మురారి’, ‘నిన్నే పెళ్లాడతా’ ‘సింధూరం’ కూడా చూసి చాలా సంవత్సరాలు గుర్తుండిపోతాయి’ అన్నారు. ఇవన్నీ ఆయనకి నచ్చినవే.. నచ్చనివి కూడా ఉన్నాయి. ‘మొగుడు’ చూసి ‘ఎందుకురా నిన్నెవరన్నా సినిమా తీయమని బతిమలాడారా’ అన్నారు. చక్రం కథ చెప్పినప్పుడు ‘హీరో చనిపోవద్దు’ అని గొడవపడ్డారు. ఆ సినిమా పూర్తయ్యే వరకు మా మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంది.

చక్రంలో ‘జగమంత కుటుంబం నాది’ అద్భుతం కదా?
కృష్ణవంశీ: అవును, ఆ పాట ‘నిన్నే పెళ్లాడతా’, ‘సింధూరం’ టైములో వినిపించారు. ఆ సాంగ్‌ అర్థం ఒకటైతే నాకు మరోలా అర్థమైంది. 2 సంవత్సరాల వరకు ఒంటరితనానికి సంబంధించిందని అనుకున్నా. చక్రంకు ఈ పాట కావాలని అడిగా. అప్పుడు ఈ పాట గురించి వివరించాడు. ‘ఈ పాటకు అర్థం తెలుసా నీకు’ అంటూ ఇది ఒక రైటర్‌ గురించి, రైటర్ ఏ విధంగా మధనపడతాడు అనేది ఈ పాటలో ఉంటుందని చెప్పారు. ఆ పాటని చక్రం సినిమాకు తగ్గట్టుగా కొద్దిగా మార్చారు.

చక్రంలో ‘జగమంత కుటుంబం’ పాటలో మొదట ‘ఏకాకి జీవనం నాది ’అని ఉండేది, తర్వాత ‘ఏకాకి జీవితం నాది’ అని మార్చారు. కారణం
కృష్ణవంశీ: కథ అంతా తెలుసు కాబట్టి ఆయన దానికి అనుగుణంగా రాశారు. దీనిలో నా బలవంతం లేదు. ఆయన పాటను ఇస్తే దాన్ని ప్రసాదంగా తీసుకోవడమే తప్ప మరేమీ అడగం. పాటలో అనుమానాలు చాలా తక్కువ సందర్భాల్లో కలిగేవి.

‘చంద్రలేఖ’ విషయానికొస్తే ‘సాహసమే చైరా డింభక.. అన్నది కదరా’ ఈ పాటలో ఇన్ని భావాలను ఎంచుకోవడానికి గల కారణాలు?
కృష్ణ వంశీ: చంద్రలేఖ చాలా సాఫ్ట్‌ మూవీ. నాగార్జునని లోయర్‌ మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిలా చూపించాలి. హీరోని తెరపై అలా చూపించేందుకు ఒక ఘంటసాల గారి పాట స్టయిల్ లో, తక్కువ పరికరాలు ఉపయోగించి, కేవలం వాయిస్‌ బేస్‌తోనే పాట ఉండాలి. దాన్ని విదేశాల్లో షూట్‌ చేస్తే బాగుంటుందనుకున్నాం. ఈ విషయం శాస్త్రి గారికి చెప్తే.. ఆయన లోపల ఉండే హాస్యం బయటకి వచ్చి పాటగా మారింది. ఆయన సాంగ్‌ రాస్తే కథ పక్కకి వెళ్లదు. నేను విత్తనం ఇస్తే చాలు మహా వృక్షాన్ని ఇస్తారాయన.

సాంగ్స్ కోసం సిరివెన్నెలను ఎప్పుడూ తొందర పెట్టలేదట నిజమేనా?
కృష్ణవంశీ: అవును. ఆయన రాసేది అమృతమైన పాటలు అయినప్పుడు తొందర పెట్టడం దేనికి. ఎదురు చూడాలి. మురారిలో పెళ్లిసాంగ్‌కి 5 నెలలు పట్టింది. ఆయన ఆ సమయంలో అమెరికాలో ఉన్నారు. అక్కడి నుంచి 30 చరణాలు ఫ్యాక్స్‌ పంపి వాటిలోంచి ఏరుకో అన్నారు. అలా పుట్టిందే ఆ సాంగ్. ఈ సినిమా రాక ముందు వరకు ఏ సినిమాలో పెళ్లి సాంగ్‌ చూసినా, ఒకేరకంగా ఉండేది. ఆ ట్రెండ్‌ను మార్చాలని నేను అన్నాను. మణిశర్మ ఆ పాటకు 10 నిమిషాల్లో ట్యూన్‌ చేశాడు. అదే ‘అలనాటి రామచంద్రుడికి అన్నింటా సాటి’ ఇప్పటికీ, ఏ పెళ్లి జరిగినా ఆ పాట ఉండాల్సిందే.

ఈ సినిమాలో మరో పాట కూడా నాకు ఇష్టమే. ‘చెప్పమ్మ.. చెప్పమ్మ.. చెప్పమ్మ.. చెప్పేసెయ్‌ అంటుంది ఓ మొహమాటం’. అప్పటి వరకు హీరో, హీరోయిన్ ఒకరినొకరు తిట్టుకుంటారు. గిల్లికజ్జాలు పెట్టుకుంటారు. హీరో తల్లికి ఆమె పుట్టింట్లో అవమానం జరగడంతో రగిలిపోతుంటాడు. కానీ, ఆ అమ్మాయి అంటే ఇష్టం. ఆ ఫీలింగ్‌ ఆమెకు చెప్పలేడు. ఆ అమ్మాయి నుంచి సమాధానం వచ్చే సందర్భం అది అని శాస్త్రి గారికి చెప్తే.. ఆయన ‘వాడికి కదా అమ్మాయి గుర్తొస్తుంది.. హీరో కదా పాడాల్సింది అన్నారు.’ అలా పుట్టిందే చెప్పమ్మా.. చెప్పమ్మా..’

Exit mobile version