Srisailam : ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 585.40 అడుగులకు చేరుకుంది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 298.58 టీఎంసీలుగా ఉంది. జలాశయానికి 3,54,831 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దిగువకు 3,14,761 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల నుంచి నీటి విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా వరద నీరు పెద్ద ఎత్తున వస్తోంది. ప్రాజెక్టు 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి స్పిల్ వే ద్వారా 3.10 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి 3.93 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ఘ నీటిమట్టం 885 అడుగులు కాగా, గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 2115.80 టీఎంసీలు. ప్రాజెక్టులో ప్రస్తుతం 204.35 టీఎంసీల నీరు ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో మరో 64,338 క్యూసెక్కుల నీరు సాగర్ కు విడుదలవుతోంది.