Kolikapudi- Mahasena Rajesh : గతంలో నేతలుగా మారాలంటే, ప్రజలను ఆకర్షించాలంటే ఎన్నో ప్రజా ఉద్యమాలు చేయాలి. ఏదైనా ఒక సమకాలిన సమస్యపై నిరంతరం పోరాటం చేయాలి. కానీ సోషల్ మీడియా యుగంలో తమ భావాలను బలంగా చెప్పగలిగేవారు ఇట్టే జనాలను ఆకర్షిస్తున్నారు. తెలంగాణలో తీన్మార్ మల్లన్న, ఆంధ్రాలో రాజేశ్ మహాసేన, కొలికిపూడి శ్రీనివాసరావు వంటివారు జనాల్లో గుర్తింపు సాధించారు. తీన్మార్ మల్లన్న విషయాన్ని పక్కనపెడితే..ఆంధ్రాలో కొలికిపూడి, రాజేశ్ మహాసేన ఇద్దరూ అనూహ్యంగా టీడీపీలో సీట్లు దక్కించుకున్నారు. కొలికిపూడి టీవీ డిబేట్లలో పాల్గొంటే, రాజేశ్ మహాసేన యూట్యూబర్. ఇద్దరూ దూకుడు కలిగిన నేతలే. ఇద్దరి లక్ష్యం ఒక్కటే. తమ వాదాన్ని బలంగా వినిపించగలరు. ఇద్దరిలోని ఈ తత్వం వల్లే చంద్రబాబును ఆకర్షించి టికెట్లు సైతం సాధించారు.
అయితే రాజేశ్ మహాసేన కు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో తన దూకుడుతనంగా ప్రస్తుతం ఇబ్బందిగా మారింది. గతంలో ఆయన చేసిన ఘాటైన వ్యాఖ్యలతో ఆయన అభ్యర్థిత్వాన్ని టీడీపీ, జనసేన, పలు హిందూ సంస్థలు వ్యతిరేకించాయి. దీంతో అతడు పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
రాజేష్ కు కుల స్పృహ ఉండడమే కాదు, ఆత్మవిశ్వాసంతో ముందుకొచ్చాడు. ఆయన మంచి దళిత ఉద్యమకారుడు కావచ్చు. దాంతోనే అతడి కీర్తి బలం పెరిగిందని కూడా చెప్పవచ్చు. అయితే దళితులపై జరిగిన ఘటనల విషయంలో ఆయన మోతాదుకు మించి మాట్లాడేశారు. ఏ యూట్యూబ్ చానెల్ ద్వారా సక్సెస్ అయ్యాడో..ఇప్పుడదే ఆయన రాజకీయ భవిష్యత్ కు అడ్డంకిగా మారింది. గతంలో జరిగిన తప్పిదాలను ఆయన సరిచేసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.
రాజేష్ మహాసేనతో పోల్చుకుంటే కొలికిపూడి శ్రీనివాస రావు తెలివైన వాడు. ముందుచూపుతో ఆలోచించే నేర్పరి. ఆయన ముందుగా వైసీపీ ఫాలోవర్. కానీ అమరావతికి వ్యతిరేకంగా జగన్ నిర్ణయం తీసుకున్న తర్వాత తన స్టాండ్ మార్చుకున్నాడు. అమరావతి రైతు ఉద్యమం వైపు అడుగులు వేశాడు. ఆ ఉద్యమానికి బలంగా అండగా నిలిచారు. ఏకంగా టీవీ డిబేట్ లోనే అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన వారి చెంప చెల్లుమనిపించాడు. ఇదీ సహజంగానే చంద్రబాబును ఆకర్షించింది. టీడీపీ శ్రేణులను మెప్పించింది. ఇప్పుడు టికెట్ కూడా దక్కించుకుని ఎటువంటి అభ్యంతరాలు లేకుండా పోటీలో నిలబడే అవకాశం దక్కింది.
దళిత, బహుజన సామాజిక వర్గాలకు చెందిన యువకులు దూకుడుగా వెళ్లే విషయంలో జాగ్రత్తగా ఉండాలని వీరిద్దరిని చూస్తే అర్థమవుతుంది. ఉద్యమాల వరకు ఓకే కానీ.. రాజకీయాల్లో అడుగులు వేయాలంటే ఎన్నో సమీకరణాలు ఉంటాయి. ఆ పార్టీల అధినేతలు, శ్రేణులు, ప్రజలు ఇలా అందరినీ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి అడ్డంకులను దాటుకుంటూ వెళ్లిన వారే రాజకీయ భవిష్యత్ ను నిర్మించుకోగలుగుతారు.