Khammam Congress : ఎట్టకేలకు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు..హేమాహేమీలకు వియ్యంకుడు ఆయన..
Khammam Congress : ఎట్టకేలకు ఆ మూడు లోక్ సభ స్థానాల కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలోనే పంచాయతీ తేలింది. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు కరీంనగర్ – వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్- షమీవలీ ఉల్లా, ఖమ్మం- రఘురామిరెడ్డి పేర్లను ఎంపిక చేసింది. రఘురామిరెడ్డి హీరో వెంకటేశ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు వియ్యంకుడు కావడం గమనార్హం. వీరిద్దరు కూతుళ్లను రఘురామిరెడ్డి కుమారులు పెళ్లి చేసుకున్నారు.
త్వరలో జరగబోయే ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను ప్రకటించింది. మూడు లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల ఖరారు ఇన్ని రోజులు సస్పెన్స్ లో ఉంచడంతో సందిగ్ధత నెలకొంది. ఖమ్మం నుంచి హేమాహేమీలు నిలవడంతో అభ్యర్థుల చివరిదాకా అభ్యర్థుల ఎంపిక డైలమాలో పడింది.
మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి ఇద్దరు ఖర్గేతో భేటీ అయ్యారు. ఇందులో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ సమావేశంలో పాల్గొన్నారు. భట్టి తన సతీమణికి ఇవ్వాలని పట్టుబడితే పొంగులేటి తన తమ్ముడికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ తెచ్చారు. దీంతో ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా బాగుండదనే ఉద్దేశంతో మూడో వ్యక్తి కోసం వెతికారు.
ఈ నేపథ్యంలో ఖమ్మం పార్లమెంట్ టికెట్ పై ఆసక్తి ఏర్పడింది. భట్టి, పొంగులేటి కుటుంబాలకు కాకుండా మరో వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని అనుకున్నారు. అయినా తప్పక పోవడంతో ఆయనకు వియ్యంకుడు అయిన రామసహాయం రఘురామరెడ్డికి టికెట్ కేటాయించారు. ఇన్నాళ్లు ఏర్పడిన సందిగ్ధతకు చెక్ పెట్టారు. ఖమ్మంలో ఆయన గెలుపు సునాయాసమే అనే ప్రచారం నడుస్తోంది.
జిల్లాకు చెందిన మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సైతం మల్లిఖార్జున ఖర్గేతో మాట్లాడారు. టికెట్ ఎవరికిచ్చినా వారి గెలుపునకు పాటుపడతామని తుమ్మల చెప్పారు. రఘురామిరెడ్డికి ఉన్న పేరుతో గెలుపు సునాయాసమే అంటున్నారు.