Gurpatwant Singh Pannun : అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ పాటు మంత్రులు, ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ తదితర హిందూ సంఘాల ప్రతినిధులు, సాధువులు, దేశంలోని సెలబ్రిటీలు ఈ వేడుకలో నేరుగా పాల్గొన్నారు. కోట్లాది హిందువులు టీవీల్లో తిలకించారు. ప్రపంచంలోనే అతి పెద్ద వేడుక ప్రశాంతంగా సాగిపోవడంపై అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఏ చిన్న ఘటన జరగకుండా ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడంపై ప్రశంసలు వస్తున్నాయి. అయితే దీని కోసం కేంద్రబలగాలు, రాష్ట్ర బలగాలు అత్యున్నమైన రక్షణ విధానాలు పాటించాయి. పకడ్బందీగా కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేశాయి.
పన్నూ హెచ్చరికల నేపథ్యంలో..
రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని భారీ ఎత్తున భద్రతా సిబ్బందిని నియమించారు. దీనికి ఓ కారణముంది. అయోధ్యలో జరిగే రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో విధ్వంసం సృష్టిస్తామని, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను హత్య చేస్తామని ఖలీస్థాని ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించాడు. ముగ్గురు ఖలీస్థానీ సానుభూతి పరులను గత శుక్రవారం ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ మేరకు పన్నూ హెచ్చరిక సందేశం పంపాడు. ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్స్ ఫర్ జస్టిస్ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూ మాట్లాడిన ఆడియో ఈమేరకు బయటకు వచ్చింది. అందులో..‘‘ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్వ్కాడ్(ఏటీఎస్) అరెస్ట్ చేసిన ముగ్గురు ఖలీస్థానీ సానుభూతి పరులను భద్రతా ఏజెన్సీలు అనవసరంగా వేధింపులకు గురిచేయవద్దు. అదే జరిగితే రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో విధ్వంసం సృష్టిస్తాం..ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను హత్య చేస్తాం’’ అని పేర్కొన్నాడు. బ్రిటన్ కు చెందిన ఓ నంబర్ నుంచి ఈ రికార్డింగ్ మెసేజ్ వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఇలాంటి బెదిరింపులు చేశాడు.
నిఘావర్గాల సమాచారం మేరకు ఖలీస్థానీలతో సంబంధం ఉందన్న ఆరోపణలతో యూపీ ఏటీఎస్ విభాగం అరెస్ట్ చేసిన ముగ్గురు యువకుల్లో ఒకరిని రాజస్థాన్ కు చెందిన సీకర్ వాసి ధరమ్ వీర్ గా గుర్తించారు. కాగా, పన్నూ హెచ్చరికలను సవాల్ గా తీసుకున్న భద్రతా బలగాలు రామ్ లల్లా కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఏ చిన్న ఘటన జరుగకుండా విజయవంతం చేశారు.
ఇంతకీ పన్నూ కథ ఏంటి?
గురుపత్వంత్ సింగ్ పన్నూ అమృత్ సర్ జిల్లాలోని ఖాన్ కోట్ గ్రామంలో జన్మించాడు. అతడి తండ్రి పంజాబ్ స్టేట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డులో ఉద్యోగి. పంజాబ్ యూనివర్సిటీ, చండీగఢ్ లో న్యాయ పట్టా పొందిన పన్నూ.. సిక్ ఫర్ జస్టిస్ కు న్యాయ ప్రతినిధి. అతడికి కెనడాతో పాటు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. భారత్ ను వదిలి విదేశాలకు వెళ్లిన పన్నూ తొలుత అక్కడ డ్రైవర్ గా పనిచేశాడు. కొంత కాలం తర్వాత న్యాయవాద వృత్తిని చేపట్టాడు. జులై 2023లో ఒక వీడియోను విడుదల చేసిన పన్నూ.. ఉత్తర అమెరికా, యూరప్ లోని భారతీయ దౌత్యవేత్తలను హత్య చేయాలని పిలుపునిస్తూ పోస్టర్లను ముద్రించాడు. భారత్ ప్రభుత్వం గురుపత్వంత్ సింగ్ పన్నూను 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది.
ఆ వీడియోలో కెనడాలోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయించడమే కాకుండా పన్నూ మరో వీడియోలో ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్ షాను కూడా బెదిరించాడు. పన్నూపై భారత్ లో దేశద్రోహ కేసుతో సహ 20కి పైగా క్రిమినల్ కసులు ఉన్నాయి. భారత్ సిక్కుల మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని ఆరోపణలు గుప్పిస్తుంటాడు.
కెనడా ఎందుకు సపోర్ట్ చేస్తోంది?
కెనడాలో సిక్కు జనాభా గణనీయంగా ఉంది. ఇమ్మిగ్రేషన్ విధానం చాలా ఉదారంగా ఉండడంతో భారతీయులు చాలా మంది కెనడాలో స్థిరపడ్డారు. అందులో సిక్కులు చాలా ఎక్కువ. సుమారు ఏడున్నర లక్షల మంది పైగా ఉన్నారు. వ్యాపార రంగం నుంచి మొదలు కుని రాజకీయ రంగం దాక వారు ప్రభావవంతంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సిక్కు ఓటు బ్యాంకును కెనడా ప్రధాని ట్రూడో కాపాడుకుంటూ వస్తున్నారు. తన మంత్రివర్గంలోనూ సిక్కులకు ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే ఖలీస్థానీ అనుకూల వేర్పాటు వాదులపై కఠిన చర్యలు తీసుకోకూడదని ట్రూడో భావిస్తున్నారు.
దీంతో పన్నూ లాంటి వారు రెచ్చిపోతున్నారు. అయితే ఆయన హెచ్చరిక వీడియోలకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సీరియస్ గానే ఉన్నారు. భారత ప్రభుత్వంతో చెలగాటమాడుతున్న పన్నూ ఏదో ఒకరోజు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.