JAISW News Telugu

Dharani Portal : ధరణి సమస్యలపై కీలక సమావేశం.. ఏం చర్చించారంటే..

Dharani Portal

Dharani Portal

Dharani Portal : బీఆర్ఎస్ ను గద్దె దించి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన వాటిలో ధరణి పోర్టల్ కూడా ఉంది. లక్షలాది రైతుల భూ సమస్యలను పరిష్కరించకుండా గత ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది. ఈ విషయాన్ని అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ నేతల దృష్టికి రైతులు తీసుకెళ్లారు.  దీంతో తాము అధికారంలోకి వస్తే ధరణిని తొలగిస్తామని, రైతుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి ప్రక్షాళనకు పలు చర్యలు తీసుకుంది. ఈక్రమంలో ధరణి వెబ్ సైట్ లో కలెక్టర్లకు ఉన్న అధికారాలను కింది స్థాయి అధికారులకు బదిలీ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. అడిషనల్ కలెక్టర్లు(రెవెన్యూ), ఆర్డీవోలు, తహసీల్దార్లకు కొన్ని అధికారాలు ఇవ్వాలని భావిస్తోంది. ఇలా చేయడం వల్ల కలెక్టర్లపై పని ఒత్తిడి తగ్గడంతో పాటు, త్వరగా పనులు పూర్తవుతాయని అంచనా వేస్తోంది.

ఈ నేపథ్యంలో బుధవారం ధరణి కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ధరణి సాఫ్ట్ వేర్ సంస్థ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ధరణి చేయాల్సిన మార్పులపై దాదాపు 10గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ధరణిలో ఏదైనా మార్పు చేయాలంటే కలెక్టర్లకే అధికారం ఉంది. ఇదే పెద్ద సమస్యగా ఉన్నట్లు కలెక్టర్లు చెప్పారు.

తమకు ఉన్న కీలక పనులతో పాటు ఇది కూడా చేయాలంటే సమయం పడుతోందన్నారు. దీంతో సమస్యలు త్వరగా పరిష్కారం కావడం లేదన్నారు. అధికారాల్లో కొన్నింటిని అడిషనల్ కలెక్టర్లు(రెవెన్యూ), ఆర్డీవోలు, తహసీల్దార్లకు ఇస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడ్డారు. సాధారణంగా కలెక్టర్ కు ఒక్క ధరణి పనులే కాకుండా జిల్లా పరిపాలనకు సంబంధించి అనేక పనులు ఉంటాయి. దీంతో ధరణి దరఖాస్తులపై దృష్టిపెట్టలేకపోతున్నట్లు తెలుస్తోంది.

పై అధికారులకు కొన్ని మాడ్యుల్స్ కు ధరణిలో అధికారం ఇస్తే సమస్యలకు త్వరగా పరిష్కారం చూపించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అలాగే ఈ సమావేశంలో భూభారతి పైలట్ ప్రాజెక్ట్ పైనా ధరణి కమిటీ చర్చించింది. ఈ ప్రాజెక్టు సగంలోనే ఆగిపోగా, అప్పటికే వివిధ గ్రామాల్లో నిర్వహించిన భూభారతి కార్యక్రమం అద్భుత ఫలితాలను ఇచ్చినట్టు తెలుస్తోంది.

Exit mobile version