BRS Leaders : తెలంగాణ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ ను గద్దె దించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. తాను హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు కసరత్తు చేస్తూనే బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే చర్యలను వేగవంతం చేసింది. గతంలో కేసీఆర్ చేసినట్టుగానే ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. తెలంగాణలో కేసీఆర్ ఛాయలు కనిపించకుండా చేయాలనే ఉద్దేశంతో వివిధ పథకాల్లో పేదలకు లాభం కంటే బీఆర్ఎస్ నేతలకే ప్రయోజనం చేకూరిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి చోటు చేసుకుందని, దాంతో కనీసం లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదని.. కేసీఆర్ పాలన తీరు ఇది అని ప్రజలకు వివరిస్తోంది.
బీఆర్ఎస్ పాలన తీరును ఎండగడుతూనే..ఆ పార్టీ నుంచి నేతలను ఆకర్షించే పనిలో పడింది. బీఆర్ఎస్ కీలక నేతలకు గాలం వేసింది. ఈక్రమంలో మొదటగా గ్రేటర్ హైదరాబాద్ పై దృష్టి పెట్టింది. ఇక్కడ కాంగ్రెస్ ఒక్క సీటు మాత్రమే వచ్చింది. అందుకే ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికి ఈ నేతలను ఆకర్షిస్తోంది. నగర మొదటి మేయర్ గా పనిచేసిన బొంతు రామ్మోహన్..బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు. రెండు రోజుల కింద రేవంత్ రెడ్డి కలిశారు. ఈమేరకు ఇవాళ(ఫిబ్రవరి 16)న కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరనున్నారు. జీహెచ్ఎంసీ ప్రస్తుత డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ అనితా రెడ్డి, మరికొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
వీరందరూ గాంధీభవన్ లో పార్టీ రాష్ట్ర ఇన్ చార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇక లోక్ సభ ఎన్నికల నాటికి మరింత మంది బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అలాగే కొంత మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్టు చెబుతున్నారు.