Pakistan team : పాక్ జట్టులో కీలక మార్పులు.. ఆ జట్టు స్టార్ పేసర్ కు దక్కని చోటు
Pakistan team : పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ లో ప్రకటించిన జట్టులో స్టార్ పేసర్ షహీన్ ఆఫ్రిది చోటు కోల్పోయాడు. ఇప్పటికే బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో పాక్ తన సొంత గడ్డపై 10 వికెట్ల తేడాతో ఓడిపోయి పరువు పోగొట్టుకుంది. దీంతో పాక్ మాజీ ఆటగాళ్లు జట్టులో ప్రక్షాళన చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది స్టార్ ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక జట్టుకు భారంగా మారుతున్నారని పాక్ వెటరన్ ప్లేయర్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ముఖ్యంగా రావల్పిండిలో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు బంగ్లాదేశ్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయింది. ఒక్క స్పిన్నర్ ను కూడా జట్టులోకి తీసుకోకుండా పొరపాటు చేసింది. రెండో ఇన్సింగ్స్ లో బ్యాటింగ్ లో పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో పాక్ తన సొంతగడ్డపై టెస్టు ఓటమితో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో 8 వ స్థానానికి పడిపోయింది.
రెండో టెస్టుకు ప్రకటించిన జట్టులో స్టార్ పేసర్ షహీన్ కు చోటు కల్పించకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షహీన్ ఇటీవలే తండ్రి అయ్యాడు. తన వ్యక్తిగత పనుల నిమిత్తం పీసీబీ వద్ద అనుమతి తీసుకున్నారని అందుకే అతడిని సెలెక్ట్ చేయలేదని కొంతమంది అంటుండగా.. మరి కొందరు మాత్రం షాహీన్ ఆఫ్రిది ని జట్టు నుంచి తొలగించారని చెబుతున్నారు. 12 మందితో కూడిన జట్టును రెండో టెస్టు కోసం ప్రకటించగా.. అందులో స్పిన్నర్ అబ్రర్ అహ్మద్ ను తుది జట్టులోకి తీసుకోగా.. షహీన్ ఆఫ్రిది స్థానంలో మీర్ హంజను తీసుకున్నారు.
దీంతో పాకిస్థాన్ తన చర్యలు ప్రారంభించిందని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు. ఒకప్పటి పాక్ జట్టు బౌలింగ్, బ్యాటింగ్ లలో చాలా బలంగా ఉండేది. వారిని ఓడించాలంటే తప్పక శ్రమించాల్సి వచ్చేది. కానీ ఈ మధ్య ఈ జట్టు పసికూనల మీద ఓడిపోతోంది. టీ 20 వరల్డ్ కప్ లో జింబాబ్వే పై , వన్డే సిరీస్ లో ఐర్లాండ్ పై, టెస్టుల్లో బంగ్లాదేశ్ పై ఇలా ఒక్కో చిన్న జట్టుపై ఓడిపోతూ తన ప్రాభవాన్ని కోల్పోతోంది.