Keshineni in TDP : టీడీపీలో ‘కేశినేని’ అలజడి.. అలా చేస్తే నష్టపోయేది ఆయనే..
Keshineni in TDP : ఏపీలో రాజకీయం కాకరేపుతోంది. తాజాగా కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడంతా వాటిపైనే చర్చ జరుగుతోంది. ఎంపీ పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేస్తానని ఓ ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్ సభ స్పీకర్ కు రాజీనామా లేఖ అందిస్తానని వెల్లడించారు. ఆతర్వాత పార్టీకి కూడా రాజీనామా చేస్తానని అందులో పేర్కొన్నారు.
‘‘చంద్రబాబు నాయుడు గారు పార్టీకి నా అవసరం లేదు అని భావించిన తర్వాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదు అని నా భావన. కాబట్టి త్వరలోనే లోక్ సభ సభ్యత్వానికి, ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తా.’’ అని నాని తన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎన్ని అవకాశాలు వచ్చినా పార్టీ కోసమే నిలబడ్డానని, ఎప్పుడూ పార్టీ మారాలనుకోలేదన్నారు.
చంద్రబాబుకు తాను వెన్నుపోటు పొడవలేను.. పొడిచి ఉంటే ఇంకా మంచి పదవిలో ఉండేవాడినేమో అని చెప్పుకొచ్చారు. చంద్రబాబును తాను వదులుకోలేదని, ఆయనే తనను వదులుకున్నారని తెలిపారు. తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తానన్నారు. రాబోయే ఎన్నికల్లో తాను విజయవాడ నుంచే పోటీ చేస్తా.. కచ్చితంగా మూడో సారి గెలుస్తా… అని ఆశాభావం వ్యక్తం చేశారు.
నాని పార్టీ కోసం బాగా కష్టపడ్డారనే భావన ప్రజల్లోనూ, కార్యకర్తల్లోనూ ఉంది. చంద్రబాబును కన్విన్స్ చేయడానికే ప్రయత్నిస్తున్నారని చెప్పొచ్చు. అయితే తాను ఇండిపెండెంట్ గెలుస్తానని చెప్పడంతో తాను ఇబ్బందులు పడడంతో పాటు పార్టీని ఇబ్బంది పెట్టినవారు అవుతారని టీడీపీ క్యాడర్ భావిస్తోంది. కేశినేని ఇండిపెండెంట్ గెలవడం చాలా కష్టమని, ఆయన పోటీ ద్వారా పార్టీపై ప్రభావం పడే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.
నాని పార్టీ శ్రేయోభిలాషిగా ఉంటే మంచిదని అంటున్నారు. ఈసమయంలోనే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. అనవసర నిర్ణయాలతో చేయి కాల్చుకోవడం ఎందుకు అని హితువు పలుకుతున్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడితే పార్టీకి, ఆయన భవిష్యత్ కు మంచిదని చెపుతున్నారు.