Kedarinath Temple : కేదారినాథ్ తలుపులు తెరుచుకోబోతున్నాయి. మే 10వ తేదీన కేదారినాథ్ ఆలయం తలుపులు తీసి నవంబర్ 14వరకు భక్తులకు శివుడి దర్శనభాగ్యం కల్పించనున్నారు. మందాకిని నదికి సమీపంలో గర్హ్వాల్ హిమాలయ శ్రేణిలో ఉన్న కేదారినాథ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల ఈ ఆలయం ఏప్రిల్, మే నుంచి నవంబర్ వరకు మాత్రమే భక్తుల దర్శనానికి అవకాశం కల్పిస్తారు. శీతాకాలంలో కేదారినాథ్ ఆలయం నుంచి దేవతా విగ్రహాన్ని కిందికి తీసుకొచ్చి ఉక్రిమత్ ప్రదేశంలో తదుపరి ఆరు నెలల వరకు పూజలు నిర్వహిస్తారు.
కేదారినాథ్ ఆలయానికి రోడ్డు మార్గం లేదు. గౌరికుండ్ నుంచి 22 కి.మీ. ఎత్తుకు కష్టమైన ప్రయాణం ద్వారా కేదారినాథ్ ఆలయానికి చేరుకోవచ్చు. అలా చేరుకోలేని వారి కోసం డోలి సేవ అందుబాటులో ఉంటుంది. హిందూ ఇతిహాసాల ప్రకారం..ఈ ఆలయం మొదట్లో పాండవులు నిర్మించారని, శివుడి పవిత్ర హిందూ మందిరాలైన పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటని భక్తులు విశ్వసిస్తారు. కేదారినాథ్ లో తపస్సు చేయడం ద్వారా పాండవులు శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ ఆలయం నిర్మించారని చెబుతారు.
ఎలా వెళ్లాలి..
ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఉన్న జాతీ గ్రాంట్ విమానాశ్రయం కేదారినాథ్ సమీపంలో ఉంటుంది. ఇక్కడి నుంచి కేదారినాథ్ చేరుకోవడానికి రోడ్డు మార్గంలో వెళ్లాలి. విమానాశ్రయం నుంచి టాక్సీలు, బస్సులు గౌరీ కుండ్ వరకు వెళ్తాయి. గౌరికుండ్ నుంచి కేదారినాథ్ వరకు 16 కిలో మీటర్ల ట్రెక్కింగ్ చేయడం అత్యంత సంప్రదాయ మార్గం. సుందరమైన ప్రకృతి దృశ్యాల మధ్య ఈ యాత్ర సాగుతుంది. ఇక రైలులో వెళ్లాలనుకునేవారు కేదారినాథ్ సమీపంలోని రిషికేష్, హరిద్వార్ స్టేషన్ లకు వెళ్లి అక్కడి నుంచి గౌరికుండ్ వరకు బస్సులు, ట్యాక్సీల్లో వెళ్లవచ్చు.