JAISW News Telugu

KCR : డీలా పడిన కేసీఆర్ ఇలాకా..ఎందుకంటే..

KCR

KCR

KCR : అధికార పార్టీ నియోజకవర్గాలకు ఓ ప్రత్యేకత ఉంటుంది.  సీఎం, మంత్రుల నియోజకవర్గాలైతే అభివృద్ధి పరుగులు పెడుతుంది. సీఎంగా కేసీఆర్ ఉన్నంత కాలం సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాలకు పంట పండిందనే చెప్పాలి.  రిచ్ నియోజకవర్గాలు అనగానే ఇవే గుర్తుకువచ్చేవి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం ఎవరూ ఊహించనంత ఫాస్ట్ గా పరుగెత్తింది. భూముల రేట్లు నింగిన్నంటాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగాక అక్కడ పరిస్థితి దారుణంగా మారిపోయింది. కేవలం మూడు నెలల్లోనే ఆ మూడు నియోజకవర్గాల్లో పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో రియల్ రంగం దారుణంగా పడిపోయింది. అంతకుముందు రోజుల్లో లక్షలు పెరిగిన జాగలు సైతం ఇప్పుడు అమ్ముడుపోని ధైన్యం నెలకొంది.

గజ్వేల్ పరిధిలోని రిజిస్ట్రేషన్ల ఆదాయం సగానికి సగం పడిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 2022-23 లో గజ్వేల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో 12,957 డాక్యుమెంట్లు నమోదయ్యాయి. ప్రభుత్వానికి 58.88 కోట్ల ఆదాయం వచ్చింది. కానీ 2023-24 వచ్చేసరికి దాదాపు 40 శాతం కోత పడి 39 కోట్లకు పరిమితమైంది. ఇందులోనూ ఎన్నికలకు ముందు జరిగిన క్రయవిక్రయాలే ఎక్కువ.

వ్యవసాయేతర భూముల పరిస్థితి కూడా అంతే. రోజులు గడిచిన కొద్ది కోటికి పైగా పలికిన ఎకరం ధర ఇప్పుడు 70 లక్షలకు పడిపోయింది. అయినా కొనేవారు కరువయ్యారు. రాబోయే రోజుల్లో మరింత పడిపోయే అవకాశం కనపడుతోంది. అయితే ఇది తాత్కాలికమేనని.. రీజినల్ రింగ్ రోడ్డు వస్తే మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉందని స్థానిక నేతలు అంటున్నా.. గజ్వేల్ అభివృద్ధికి నిధులు పెద్దగా రావన్న ఉద్దేశంతోనే రియల్ రంగం నేలచూపులు చూస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇక కాంగ్రెస్ రాష్ట్ర అగ్రనేతల నియోజకవర్గాల్లో రియల్ ఎస్టేట్ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కొడంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అగ్రనేతల నియోజకవర్గాలకు నిధులు పుష్కలంగా వచ్చే అవకాశాలు ఉండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారనుంది.

Exit mobile version