CM Revanth : పదేళ్లు అధికారాన్ని అనుభవించిన కేసీఆర్ కు నానా కష్టాలు వచ్చాయి. పార్టీ పరంగా ఎలా ఉన్నా కుమార్తె కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ కావడం ఆయన్ను మరింత కుంగదీస్తోంది. కవితను కాపాడుకోవడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. దీని కోసం ప్రధాని మోదీతో కుమ్మక్కయ్యారా? అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగా బీజేపీ సహకరించేందుకు ఐదు లోక్ సభ స్థానాల్లో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారా? రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ను కూల్చాలని కేసీఆర్ బీజేపీతో కలిసి కుట్రలు చేస్తున్నారా?
పై ప్రశ్నలకు అవును అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్. సోమవారం నారాయణపేట జనజాతర సభలో ఆయన ప్రసంగిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన బిడ్డ కవిత జైలు పాలైతే ఆమెను కాపాడుకునేందుకు బీజేపీతో జతకట్టారని ఆరోపించారు. బిడ్డను కాపాడుకునేందుకు ప్రధాని నుంచి సుపారీ తీసుకున్నారని ఆరోపించిన రేవంత్..అందులో భాగంగా చేవెళ్ల, మల్కాజిగిరి, జహీరాబాద్, మహబూబ్ నగర్, భువనగిరి లోక్ సభ స్థానాల్లో కేసీఆర్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారన్నారు.
తనను పడగొట్టేందుకు కేసీఆర్, నరేంద్రమోదీ ప్రయత్నిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఓ వైపు బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఏక్ నాథ్ షిండే వ్యాఖ్యలు చేస్తుండడంతో రేవంత్ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. మరో వైపు మల్కాజిగిరి, సికింద్రాబాద్ స్థానాల్లో బీజేపీకి సహకరించేందుకు కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను పోటీలో నిలిపిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
లిక్కర్ స్కామ్ లో కవిత బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేయడం మనకు తెలిసిందే. అయినా ఆమెకు ఊరట లభించడం లేదు. ఇప్పటికిప్పుడు ఆమెకు బెయిల్ దొరికే అవకాశాలు కనపడడం లేదు. ఈ కేసు రాజకీయ ప్రేరేపితమైందని ఆరోపణల నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. నిజంగానే కవితను విడుదల చేసేందుకు కేసీఆర్ మోదీతో ఒప్పందం చేసుకున్నారా? అనే చర్చ సర్వత్రా నడుస్తోంది. ఇదిలా ఉండగా కేసీఆర్ పై జనాల్లో కొంతమేరకు సానుభూతి ఉన్నా కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ కావడంపై జనాల్లో ఏమాత్రం సింపతీ రాకపోవడం గమనార్హం. లిక్కర్ స్కాంలో ఆమె పాత్ర ఉండే ఉంటుందని మెజార్టీ ప్రజలు నమ్ముతున్నారు.