KCR : కేసీఆర్ ఇప్పటికైనా భాష మార్చుకో
KCR : కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ మాజీ సీఎం ఈ పేరు దేశానికి పెద్దగా పరిచయం అవసరం లేదు కదా. ఆయన ఎక్కువగా వాక్ చాతుర్యం, ప్రసంగాలతోనే ఫేమస్ అయ్యారు. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లిష్, ఉర్ధూ భాషలను అనర్గళంగా మాట్లాడే నాయకుడు కేసీఆర్. తన రాజకీయ జీవితంలో తెలంగాణ ఉద్యమం నుంచే కేసీఆర్ రాష్ట్రానికి పరిచయం అయ్యాడు.
కేసీఆర్ ప్రసంగాలతోనే జనాలను ఆకట్టుకున్నారు. తెలంగాణ యాస భాష, నుడికారాలు, ఉర్ధూతో పెనవేసుకున్న బంధం అన్నీ ఆయనకు తెలుసు. వైఎస్ మరణం తర్వాత ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉద్యమాన్ని కేసీఆర్ ముందుండి నడిపించారు. ఆయన చేసిన ప్రసంగాలు స్వరాష్ట్ర ఏర్పాటులో కొంత భాగం అయ్యాయనేది మత్రం ఒప్పుకోలేని నిజం. అయితే.. అప్పుడప్పుడు అవే ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టేవి.
ఉద్యమం వెనక్కు తగ్గని రోజుల్లో ఇక ఆంధ్రా ప్రాంతం శాంతియుతంగా విడిపోవాలని అనుకున్న సమయంలో కేసీఆర్ ప్రసంగాల్లో ఘాటు వ్యాఖ్యలు వారిని తీవ్రంగా హర్ట్ చేశాయి. అవి ఎంతలా అంటే? కేసీఆర్ ప్రసంగం పూర్తయిందంటే చాలు కేసులు నమోదయ్యేవి. ఒక్కోసారి ఒక్కో విధంగా ఉండేవి. కానీ వాటిని ఏనాడు ఆయన పట్టించుకునే వారుకాదు..
ఇక స్వరాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఉద్యమ పార్టీగా తెచ్చిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్)ను రాజకీయ పార్టీగా మలిచారు. ఎన్నికల్లో పోటీ చేసి తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకొని మెజారిటీ సీట్లను కైవసం చేసుకున్నాడు. రెండు సార్లు రాష్ట్రాన్ని పాలించిన నేత ప్రతీ సారి కఠిన మైన భాషనే ఉపయోగించేవారు. ఇక 2023లో అధికారానికి దూరమైనా స్వరంలో, భాషలో కాఠిణ్యాన్ని వీడలేదు కేసీఆర్.
ఇటీవల కాంగ్రెస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 5న సిరిసిల్ల బహిరంగ సభలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని, ఆయన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాయని ఈసీ వ్యాఖ్యానించింది. ‘లత్కూర్’, ‘చవట దద్దమ్మలు’, ‘చేతకాని చవటాలు’, ‘పక్కా చవటాలు’ వంటి పదాలను కేసీఆర్ ఉపయోగించారు.
కేసీఆర్ వ్యాఖ్యలు కించపరిచేలా ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ నేతల ప్రతిష్టకు భంగం వాటిల్లే అవకాశం ఉందని ఈసీ అభిప్రాయపడింది. ఏప్రిల్ 18లోగా వివరణ ఇవ్వాలని కేసీఆర్ ను ఆదేశించింది. ఇలా ప్రతీ సారి కేసీఆర్ తన ప్రసంగాలతో ఇరుక్కుంటూనే ఉన్నారు.