KCR to Assembly : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సారి నిర్వహిస్తున్న ఈ బడ్జెట్ సమావేశాలకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతున్నాడు. కేసీఆర్ కూడా ప్రతిపక్షంలో ఉంటూ అసెంబ్లీలో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి మొన్నటి వరకు ప్రతిపక్షంలో కూర్చోవడానికి ఆయన సుముఖంగా లేరని ప్రచారం జరిగినా అధికార కాంగ్రెస్ ను ఎదుర్కొనేందుకు ఆయన సభకు రావాలని నిర్ణయించుకున్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ లు పలు అంశాలపై వాదనలకు దిగుతున్న నేపథ్యంలో సహజంగానే ఈ సమావేశాలు రసవత్తరంగా మారే అవకాశం ఉంది. కృష్ణా బేసిన్ సాగునీటి ప్రాజెక్టుల అప్పగింత, ఎన్నికల హామీల అమల్లో జాప్యంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు టీఆర్ఎస్ అన్ని అస్త్రాలతో సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్ర స్థాయిలో రాజకీయ రగడ కొనసాగుతుండడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భారీ అవినీతి, ఇంజినీరింగ్ లోపాలను ఎండగట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అస్త్ర శస్త్రాలతో సిద్ధంగా ఉంది. ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ, మండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఆ తర్వాత శుక్రవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదం పొందనుంది.
ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శనివారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం బడ్జెట్ పై సాధారణ చర్చ జరగనుంది. 6 హామీలను నిర్విఘ్నంగా అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో తాత్కాలిక బడ్జెట్ కేటాయింపులు కీలకం కానున్నాయి. రూ.500 ఎల్పీజీ సిలిండర్, ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సహా మరో రెండు పథకాలను ప్రారంభించడంపై ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలు పరిశీలనలో ఉన్నాయి.