KCR-KTR : గత 23 ఏండ్లుగా తెలంగాణ రాజకీయాలు కేసీఆర్ చుట్టే తిరిగాయి. ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర తొలి సీఎంగా ఆయన పేరు చరిత్ర లిఖితం. ఆయన లేనిదే తెలంగాణ రాజకీయాలు లేవు. అలాంటి కేసీఆర్ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గద్దె దిగక తప్పలేదు. దశాబ్దాల తరబడి కాలంలో ఫుల్ జోష్ తో ఉన్నా శ్రేణులు ఒక్కసారిగా ఢీలాపడ్డాయి. ప్రస్తుతం పార్టీ గ్రాఫ్ దారుణంగా పడిపోతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తే శ్రేణుల్లో మళ్లీ జోష్ వస్తుందని కార్యకర్తలు భావిస్తున్నారు. అప్పుడే కార్యకర్తలు, నాయకులు నమ్మకంగా పార్టీ కోసం పనిచేస్తారని అంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకొస్తున్న వేళ పార్టీ ఎంపీలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి జంప్ కావడం.. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ బాగా బలహీన పడిందనే ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారాన్ని తట్టుకుంటూ కార్యకర్తలు ఉత్సాహంగా ఉండాలంటే కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒకరు పోటీ చేయాలి. కల్వకుంట్ల కుటుంబంలో ఇప్పటికే కేసీఆర్, కవితలకు ఎంపీలుగా పనిచేసిన అనుభవం ఉంది. తాజాగా కేటీఆర్ కూడా తాను మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి అవసరమైతే పోటీ చేస్తానని సవాల్ విసిరారు. ఇది కేవలం రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టడానికి చేసిన సవాల్ గా కాకుండా పార్టీని కాపాడే నిర్ణయంగా మారాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఆయన నిజంగానే ఎంపీగా పోటీచేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
పార్టీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్న సన్నాహక సమావేశాలలో వారు ఎంత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ.. పార్టీ బలహీనపడుతున్న సంగతి కార్యకర్తలకు అనుభవంలోకి వస్తోంది. కొందరు ఎంపీలు ఆల్రెడీ పార్టీ మారిపోయారు. ఈ బాటలో సిట్టింగ్ ఎంపీలు ఇంకా ఉన్నట్టుగా, ఇతర పార్టీలతో మంతనాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పలు మున్సిపాలిటీలు, జడ్పీలు ఒక్కొక్కటిగా గులాబీ దళం నుంచి కాంగ్రెస్ పరం అవుతున్నాయి. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ ఇంకా గేట్లు ఓపెన్ చేసినట్టు లేదు. ఎమ్మెల్యేలు పలువురు సీఎం రేవంత్ ను కలుస్తున్నారు. ఇక అక్కడా చేరికలు మొదలైతే ఆపడం కష్టమే.
ఎంపీ ఎన్నికల విషయంలో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని జనాలు అనుకుంటున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న తమ పార్టీకి ఇది చాలా ప్రమాదకర పరిణామం అని కార్యకర్తలు భావిస్తున్నారు. ఒకవైపు గులాబీ నాయకులు మాత్రం.. తమకు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ బీజేపీతో మాత్రమేనని, కాంగ్రెస్ రేసులో లేదని ప్రగాల్భాలకు పోతున్నారు. ఈ మాటలు రాజకీయాల్లో పనికిరావని.. పార్టీ రాష్ట్రవ్యాప్తంగా క్రియాశీలకంగా మారాలంటే కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి ఒకరు పోటీ చేస్తేనే అది సాధ్యమవుతుందని అంటున్నారు.