Shocking Strategy : తెలంగాణ ఎన్నికలకు పోలింగ్ దగ్గర పడుతున్నా కొద్దీ ఆయా పార్టీల్లో గెలుపుపై గందరగోళం ఏర్పడింది. బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్ తో ప్రశాంత్ కిషోర్ ఇటీవల భేటీ కావడం తీవ్ర చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ కు గతంలో పని చేసిన ప్రశాంత్ కిషోర్. అందులోకి సునీల్ కనుగోలు ఎంట్రీతో బయటకు వచ్చాడు. తర్వాత బీఆర్ఎస్ వైపునకు వచ్చారు. గతంలో పీకే (ప్రశాంత్ కిషోర్) బీఆర్ఎస్ గెలుపు, రాష్ట్రంలో దాని పరిస్థితిపై సర్వే కూడా చేయించాడు.
గత ఆదివారం (నవంబర్ 19) ప్రశాంత్ కిషోర్ ప్రగతి భవన్ కు వచ్చారని.. కేసీఆర్, కేటీఆర్ తో కలిసి దాదాపు మూడున్నర గంటలకు పైగా చర్చలు జరిపారని తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితిపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఇంటలీజెన్స్ రిపోర్ట్, ఇతర ప్రైవేట్ సంస్థల సర్వేలో ఎక్కువగా కాంగ్రెస్ పేరు వినిపిస్తుండడంతో ఎలా మార్చాలన్న అంశంపై మాట్లాడినట్లు చెప్తున్నారు.
బీఆర్ఎస్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల బహిరంగ సభల్లో తను చేపట్టిన పథకాలు, చేపట్టేబోయే పథకాలు, బీఆర్ఎస్ మేనిఫేస్టో గురించి చెప్పడం లేదు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఏదో జరుగుతుందని మాత్రం భయపెడుతున్నారు. ఇందులో కూడా ప్రశాంత్ వ్యూహం కనిపిస్తున్నట్లుగా టాక్ ఉంది. ఈ సారి కాంగ్రెస్ కు అవకాశం ఇద్దాం అనుకునే వారి ఆలోచనల్లో ఎంతో కొంత మార్పు తీసుకువస్తే ఎలాగోలా బయటపడవచ్చని ప్రశాంత్ కిషోర్ సూచనలు చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కు ఓటు వేయాలనుకునే వారి ఆలోచనలో మార్పు తీసుకువచ్చేందుకు.. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అటు వైపునకు వెళ్లకుండా చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రశాంత్ కిషోర్ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. గతంలో ఒప్పందం చేసుకున్నా.. ఆ తర్వాత వదులుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయనను భరించడం, ప్రభుత్వ పాలనలో ఆయన జోక్యం నేపథ్యంలో వద్దనుకున్నట్లు కేటీఆరే గతంలో చెప్పారు. కానీ బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితుల్లో పీకే అవసరమని భావించి మళ్లీ ప్రగతి భవన్ కు పిలిపించి మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన కేసీఆర్, కేటీఆర్ కు ఏం సలహాలు ఇచ్చారు.. ఇంకా పోలింగ్ (నవంబర్ 30) కు వారం ఉంది కాబట్టి ఎలాంటి వ్యూహం రచించారని రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.