Lok Sabha Elections : ఒక్క ఓటమి ఎన్నో కష్టాలకు కారణమవుతుంది. బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం వారిని కుంగదీస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉండేందుకు ఇష్టపడటం లేదని వార్తలు వచ్చాయి. మరోవైపు హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. ఫిబ్రవరిలో కేసీఆర్ పార్టీ వ్యవహారాలు చూసుకుంటారు. పార్టీని గాడిలో పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతారనే సంకేతాలు ఇచ్చారు. దీంతో రాష్ట్ర రాజకీయాలను తనదైన శైలిలో తమ వైపు తిప్పుకునే పనిలో పడతారని చెబుతున్నారు.
ఇక కేటీఆర్ కూడా తాను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పడంతో ఇక రాష్ట్ర రాజకీయాలను ఎవరు నడిపిస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. కవిత కూడా నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ముగ్గురు పార్లమెంట్ కు వెళితే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. అందుకే ఒకరు ఇక్కడే ఉండి ఇద్దరు పార్లమెంట్ కు వెళతారనే టాక్ వస్తోంది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి గుర్తింపు ఉండాలంటే కేసీఆర్ ఉండాలని చెబుతున్నారు. ఇక ఆయన ప్రతిపక్ష నేతగా ఉండేందుకు అసహనంగా భావిస్తున్నారని చెబుతున్నారు. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. హరీష్ రావు ప్రకటనతో పార్టీలో చర్చలు మొదలయ్యాయి. అందరు లోక్ సభకు వెళితే ఎలా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం వారిని వేధిస్తోంది. ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి వెళ్లడానికి ఇష్టపడటం లేదు. కేటీఆర్ దురహంకార వ్యాఖ్యల వల్లే పార్టీ నష్టపోయిందని పలువురు చెప్పడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో కేటీఆర్ రాష్ట్ర రాజకీయాల్లో ఉండే ప్రతికూల ఫలితాలే వస్తాయని అంటున్నారు. కేటీఆర్ ను పార్లమెంట్ కు పంపించి కేసీఆర్ ఇక్కడే ఉండి పార్టీ కార్యక్రమాలు చక్కబెడితే బాగుంటుందనే వాదనలు పార్టీ వర్గాల నుంచి వస్తున్నాయి.