KCR : ఎంత ఎదిగినా ఒదగాలని చెబుతారు. అహంకారం నెత్తికెక్కితే పతనం ఖాయం. బీఆర్ఎస్ నేతల తలపొగరే వారి పతనానికి కారణమైంది. వారి బలుపు మాటలే వారికి ఓటమి తీసుకొచ్చింది. వాపును చూసుకుని బలుపు అనుకున్నారు. తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది అన్నట్లు వారికి పరాజయం పాలవుతుందని తెలిసినా విజయం మాదే అనే ధోరణిలో వారి ప్రవర్తన కొనసాగింది.
రాష్ట్రంతో పాటు దేశంలో ప్రభావం చూపుతామని కలలు కన్నది. కానీ రాష్ట్రంలోనే ఘోరమైన పరాభవం మూటగట్టుకుంది. మాకొద్దీ దొరల పాలన అంటూ ప్రజలు తిరస్కరించారు. దీంతో ప్రతిపక్షానికి పరిమితమైపోయారు. అయినా వారిలో బుద్ధి రావడం లేదు. వారి తీరు మారడం లేదు. వారి ఆలోచన విధానం అలాగే ఉంటోంది. ఇంకా బలుపు మాటలు పోవడం లేదు.
మహారాష్ట్రలో కూడా ప్రభావం చూపాలని పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసింది. అక్కడ జరిగిన స్థానిక ఎన్నికల్లో పోటీ చేసింది. ఇక్కడ కూడా విజయం సాధించి జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతానని భావించిన కేసీఆర్ కు చుక్కెదురైంది. ఊహించని దెబ్బ తగిలింది. దీంతో మహారాష్ట్రలోని కార్యాలయాలు మూత పెడుతోంది. సొంత రాష్ట్రంలోనే గెలవని పార్టీ ఇక్కడ ఎలా గెలుస్తుందనే వాదనలు వచ్చాయి.
ఇక ఆంధ్రలో కూడా పోటీ చేసి తన రహస్య మిత్రుడికి మేలు చేయాలని భావించినా ఇక్కడే నిలబడలేకపోయే అక్కడ ఏం నిలబడతాడని అంటున్నారు. మొత్తానికి ఓటర్లు కీలెరిగి వాతపెట్టారు. మంచి గుణపాఠం నేర్పారు. ఎంత ఎదిగినా ఒదిగుండాలనే దానికి విరుద్ధంగా వ్యవహరించి ఇప్పుడు చావుదెబ్బలు తిన్నారు. అయినా వారి బింకాలు మారడం లేదు.