KCR Mind Game : రాజకీయ వ్యూహాలు రచించడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధహస్తుడు. ప్రతిపక్ష పార్టీలను డిఫెన్స్ లో పడేయడంలో దిట్ట. అలాగే ఓటర్లను తమ వైపునకు తిప్పుకోడంలోనూ చాలా నేర్పరి. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంచి రంజుమీద ఉన్నది. ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయ రణరంగం రోజురోజుకూ మరింత వేడేక్కుతుంది.
కేసీఆర్ స్పీచ్ హైలెట్.. కానీ..
కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి మంచి వక్త. పల్లె జనాలతో పాటు చదువుకున్న వాళ్లను కూడా తన మాటలతో కట్టిపడేయగలడు. పల్లె ప్రజల్లో తన మాటల తూటాలతో ఆలోచన రేకేత్తించగలడు. ఉద్యమ సమయంలో కేసీఆర్ స్పీచ్ కోసం తెలంగాణ తో పాటు ఆంధ్రా నాయకులు కూడా వేచి చూసే వారు. తన పంచ్ డైలాగులతో, పల్లె సామెతలతో సభలో ఓ ఉత్సాహ పూరిత వాతావరణాన్ని సృష్టించడంలో దిట్ట. ప్రతిపక్ష పార్టీల నేతలను చీల్చి చెండాడే వాడు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా కేసీఆర్ నోటి వెంట తమ పేరు రావాలని, తమను టార్గె ట్ చేయాలని భావించే వారు. అదీ కేసీఆర్ పవర్.
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రసంగాల్లో కొత్తదనం ఉండడం లేదు. రోజుకు దాదాపు రెండు లేదా మూడు సభల్లో పాల్గొటున్నారు. అన్ని సభల్లో ఒకేలా మాట్లాడుతున్నారు. దీంతో నాయకలతో పాటు జనాల్లోనూ కేసీఆర్ ప్రసంగాలపై ఆసక్తి తగ్గింది. ఈ విషయం కేసీఆర్ కు ఎలా చెవిన పడిందో ఏమో గాని ప్రసంగాల్లో రోజు వారి డైలాగులకు అదనంగా మరో కొత్త పల్లవి అందుకున్నాడు. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే. అందులో తెలంగాణ నుంచి బీఆర్ఎస్ కీలకం కాబోతుందంటూ కొత్త చర్చకు దారి తీశాడు. దీంతో తెలంగాణ ఓటర్లు ఇతర పార్టీల కు మళ్లకుండా కేసీఆర్ వేస్తున్న ఎత్తుగడ అని పలువురు పేర్కొంటున్నారు.
సంకీర్ణ ప్రభుత్వాలే వస్తాయని, ప్రాంతీయ పార్టీలు కీలకం కాబోతున్నాయని చెప్పుకొస్తున్నారు. కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని చెబతున్నారు. అయితే ఇది కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు చీలకుండా చేసే ప్రయత్నమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 సాధారణ ఎన్నికల సమయంలోనూ ఇలాగే చెప్పారని గుర్తుచేసుకుంటున్నారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపినా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కేసీఆర్ తాను అనుకున్న సీట్లు సాధించలేకపోయాడని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.