KCR : కేసీఆర్ కు ఎన్ని కష్టాలో..ఏదీ కలిసి రావడం లేదే..

KCR

KCR

KCR : మొన్నటి అసెంబ్లీ ఎన్నికల దాక కేసీఆర్ ఏకచ్ఛత్రాధిపత్యంగా తెలంగాణను శాసించారు. ఉద్యమనేతగానూ, పదేళ్లు సీఎంగా హవా సాగించారు. మూడో సారి హ్యాట్రిక్ పక్కా అని ధీమాగా ఉన్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులను ఏమాత్రం లెక్కచేయకుండా ప్రజలంతా తన వైపే ఉన్నారన్న అతి విశ్వాసంతో ఎన్నికలకు వెళ్లారు. తీరా కాంగ్రెస్ చేతిలో పరాజయం పాలయ్యారు. కేసీఆర్ కలలో కూడా ఊహించని పరాభావం ఎదురయైంది. ఇక అప్పటి నుంచి కేసీఆర్ సీరియల్ కష్టాలు మొదలయ్యాయి.

సీఎం పదవి పోగానే బాత్రూమ్ లో కాలు జారి పడి కాలుకు శస్త్ర చికిత్స చేయించుకుని కొన్ని నెలల పాటు మంచానికే పరిమితమయ్యారు. ఇదిలా ఉండగానే పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఒక్కొక్కరుగా గులాబీ కండువా మార్చే పనిలో బిజీ అయ్యారు. కేసీఆర్ ఆరోగ్యం కొంచెం కుదుటపడగానే ఇటు కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైలుకు వెళ్లారు.

అలాగే కేటీఆర్ పైన కూడా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రావడంతో ఇక మౌన ముద్ర నుంచి బయటకు వచ్చి పార్టీని, పార్టీ శ్రేణులను లోక్ సభ ఎన్నికలకు సిద్ధం చేసే పనిలో పడ్డ కేసీఆర్ రాష్ట్ర వ్యాప్త ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఇందులో భాగంగా సిరిసిల్ల సభలో ప్రసంగించిన కేసీఆర్ కాంగ్రెస్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై ఈసీ చర్యలకు ఉపక్రమించింది.

ఈరోజు రాత్రి 8గంటల నుంచి 48 గంటల పాటు ఎటువంటి ఎన్నికల ప్రచారం చేయకూడదని, ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఇంటర్వ్యూ లలో పాల్గొనకూడదంటూ నిషేధం విధించింది. అయితే ఈసీ చర్యలపై స్పందించిన కేసీఆర్ తన మాటలను స్థానిక మాండలికాన్ని అధికారులు సరిగ్గా అర్థం చేసుకోలేదని, వాటిని వక్రీకరించి కాంగ్రెస్ నేతలు నాపై ఫిర్యాదు చేశారంటూ వ్యాఖ్యానించారు. అలాగే కేటీఆర్ కూడా కేసీఆర్ ప్రచారంపై ఈసీ విధించిన 48 గంటల నిషేధాన్ని ఖండిస్తూ ఇదెక్కడి అరాచకం? తెలంగాణ గొంతు అయినా కేసీఆర్ పైనే నిషేధమా? మోదీ చేసిన విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా? అలాగే రేవంత్ మాట్లాడుతున్న బూతులు కనిపించలేదా? అంటూ తన ఎక్స్ అకౌంట్ లో స్పందించారు. ఇలా కేసీఆర్ కు ఒకదాని తర్వాత మరొకటి కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి.

TAGS