KCR Bus Yatra : తెలంగాణలో అస్తిత్వ పోరాటం చేస్తున్న బీఆర్ ఎస్ పార్టీలో జవసత్వాలను నింపడం కోసం ఆ పార్టీ అధినేత కేసీఆర్ బస్సుయాత్ర చేయాలని నిర్ణయి తీసుకున్నారు. ఇప్పటికే లోక్ సభ ఎన్నికలను ఎదుర్కునేందుకు ప్రజల్లోకి వెళ్తున్న కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు లోక్ సభ అభ్యర్థులతో తెలంగాణ భవన్ లో కీలక సమావేశం ఏర్పాటు చేశారు.
అభ్యర్థులకు బీ-ఫారంలతో పాటు వారి ప్రచార ఖర్చు కోసం రూ.95 లక్షల చొప్పున చెక్కులు అందించనున్నారు. అనంతరం ఎన్నకల ప్రచారంపై దిశా నిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్ర చేయాలని నిర్ణయించిన కేసీఆర్, నాయకులతో చర్చించి రూట్ మ్యాప్ పై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని, ప్రజల పక్షాన అధికార కాంగ్రెస్ పార్టీపై యుద్ధం చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరువు తాండవిస్తోందని, కరువుతో రైతులు పంటలు ఎండిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కష్టాల్లో ఉన్న రైతాంగానికి భరోసా కల్పించడానికి రాష్ట్రంలో పర్యటించాలని కేసీఆర్ భావిస్తున్నారు.