KCR Decision : కేసీఆర్ సంచలన నిర్ణయం.. ఈసారి తెలంగాణకే పరిమితం..!

KCR Decision

KCR Decision

KCR Decision : మరో రెండు, మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తాజాగా తన ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో పార్టీ కీలక నేతలు, పార్లమెంట్ సభ్యులతో భేటీ అయ్యారు. దాదాపు రెండు నెలలుగా ఇంటి నుంచి బయటకు రాని కేసీఆర్.. లోక్ సభ ఎన్నికలకు మరికొన్ని రోజుల్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉండడంతో ఈ భేటీ ఏర్పాటు చేశారు. దీనిలో కేటీఆర్, హరీశ్ రావు, నామా నాగేశ్వరరావు, కవిత తదితరులు హాజరయ్యారు.

రాష్ట్రంలో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ పుంజుకున్న నేపథ్యంలో ఆ రెండు పార్టీలను సమర్థంగా ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ చర్చించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఆర్టీసీలో బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో మహిళా ఓటు బ్యాంకు పరిస్థితిని కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా కేడర్ పరిస్థితి, క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అనుకూల..ప్రతికూల పరిస్థితులను కూడా ఆయన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని కేవలం తెలంగాణకే పరిమితం చేయాలని నిర్ణయించారు.

వాస్తవానికి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇతర పార్టీలను కూడగట్టి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ పై యుద్ధం చేయాలని కేసీఆర్ భావించినప్పటికీ.. తెలంగాణలోనే ఓడిపోవడం, తనకు అనారోగ్యం, కేంద్రంలో బీజేపీ బలంగా ఉండడం వంటి కారణాలతో ఈ దఫా ఎన్నికలకు రాష్ట్రానికే పరిమితం కావాలని, కనీసం 12-15 స్థానాల్లో గెలిచేందుకు సమాయత్తం కావాలని సూచించారు. దీని కోసం వ్యూహాలు రచించాలన్నారు. అవసరమైతే మరిన్ని పథకాలు ప్రకటించడం ద్వారా ఓటర్లను ఆకట్టుకోవాలన్నారు. ముఖ్యంగా మహిళా ఓటు బ్యాంకుపై దృష్టిపెట్టాలన్నారు.

రెండు జాతీయ పార్టీలు జోష్ లో ఉండడం.. జాతీయ విధానాలపై జరిగే ఎన్నికలు కావడంతో.. బీఆర్ఎస్ ఏ విషయాలపై ముందుకు వెళ్లాలన్న చర్చ కూడా జరిగింది. ప్రధానంగా బీజేపీ రామమందిర నిర్మాణంపై ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దీనిని రాష్ట్రంలో ఎలా ఎదుర్కొవాలనే విషయాలపైన కేసీఆర్ దృష్టి పెట్టినట్టు తెలిసింది.

TAGS